CM Revanth Reddy: జర్నలిస్టుల గుర్తింపుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు !
జర్నలిస్టుల గుర్తింపుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు !
CM Revanth Reddy: ‘కొంతమంది జర్నలిస్టులు చీఫ్ మినిస్టర్‌ను చీప్ మినిస్టర్ అంటూ కుర్చీకు ఉన్న గౌరవం పొగొడుతున్నారు. వ్యక్తి నచ్చక పోవచ్చు వ్యవస్థలో గౌరవప్రదమైన పదవికి విలువ ఇవ్వాలి. ఎదుటి వారు విలువలు దాటితే మేము దాటుతాం. జర్నలిస్ట్‌లకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వారు ఎలా ఉన్నారో ఆలోచన చేయాలి అంటూ తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు చురకలు అంటించారు. ఆదివారం రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ… కొంతమంది జర్నలిస్ట్‌లు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్ట్‌లు హద్దులు దాటి వ్యవహారించకూడదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్(CM Revanth Reddy) మాట్లాడుతూ… ‘కొన్ని సందర్భాల్లో చిట్చాట్లను సైతం ఇంకొకలాగా రాస్తున్నారు. గతంలో గాంధీ భవన్లో సన్నిహితంగా మాట్లాడిన మాటలను రికార్డు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసమే జర్నలిస్ట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఆరోగ్య శ్రీ కార్డుల విషయంలో ఎవరికి ఎలాంటి అపోహాలు అవసరం లేదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొంతమంది జర్నలిస్ట్ లు సెక్రటేరియట్లో అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. అలాంటి జర్నలిస్ట్‌లకు విలువ లేదని స్పష్టం చేశారు. ఎవరిని చూసిన తాము యూట్యూబ్ జర్నలిస్టులమని అంటున్నారని… కొందరు ఇంకేదో జర్నలిస్టులమని చెబుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అయితే ఎవరిని జర్నలిస్టులుగా గుర్తించాలో మీరే సూచించాలని ఆయన జర్నలిస్టులను కోరారు.
CM Revanth Reddy – 11 వందల మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు !
సమాజంలో జర్నలిస్ట్‌ల సమస్యలను దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనాడే గుర్తించారని తెలిపారు. 11 వందలమంది జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం సంతోషమని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కొంతమంది బాధ్యతగా వ్యవహరించడం లేదని అన్నారు. రాష్ట్ర విభజన లాంటి అంశాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుందని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు తమ ప్రభుత్వంలో త్వరగా పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
Also Read : Vijay: దళపతి విజయ్ పార్టీకి ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక గుర్తింపు !