MLA Pantham Nanaji : జనసేన ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాలు

‘ మిమ్మల్ని ఉమామహేశ్వరరావు తిట్టారు’ అంటూ ఫిర్యాదు చేశారు...

MLA Pantham Nanaji : రంగరాయ వైద్య కళాశాల ఫొరెన్సిక్‌ విభాగాధిపతి, కాలేజీ స్పోర్ట్స్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై దాడి ఘటనను దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ(MLA Pantham Nanaji) , ఆయన అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన దళిత నాయకులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయికి ఎదిగిన ఓ దళితుడిపై దాడి చేయడం తమ వర్గంపై చేసిన దాడిగా భావిస్తున్నట్లు వారు చెప్పారు. దాడి చేసి బూతులు తిట్టిన ఎమ్మెల్యేపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన మేనల్లుడిపైనా కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

MLA Pantham Nanaji…

అయితే దాడి, దూషణలకు సంబంధించి కేసు పెట్టే ఆలోచనలో ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సర్పవరం స్టేషన్‌లో ఇవాళ(ఆదివారం) ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యేను ఏ-1గా చేర్చాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పినా వైద్య విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు. దాడి చేయడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం దాడిని తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే, ఆయన అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని అసోసియేసన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పిడకాల శ్యాంసుందర్‌ డిమాండ్‌ చేశారు.

మరోవైపు దాడి చేయడంపై ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుకి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ(MLA Pantham Nanaji) క్షమాపణలు చెప్పారు. కేసు ఫైల్ చేయొద్దని తాను అడగడం లేదని, వైద్య వర్గాన్ని ఉద్దేశించి తాను వ్యాఖ్యలు చేయలేదంటూ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అలా ఎవరీతోనూ, ఎప్పుడూ ప్రవర్తించలేదని, ఆవేశంలో అలా మాట్లాడినట్లు తెలిపారు. వైద్య వృత్తికి క్షమాపణలు చెబుతున్నట్లు ఎమ్మెల్యే నానాజీ చెప్పారు. అయితే విషయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వద్దకు చేరింది. పవన్ మందలించడంతోనే ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

ఆర్‌ఎంసీ కళాశాల మైదానంలో పంతం నానాజీ(MLA Pantham Nanaji) అనుచరులు అనధికారికంగా కొన్ని నెలలుగా వాలీబాల్‌ ఆడుతున్నారు. తమ కళాశాల మైదానంలో ఆడొద్దంటూ వారికి యాజమాన్యం చెప్పింది. వారు ఆడుకోవడానికి అనుమతించాలని కళాశాల అధికారులకు ఎమ్మెల్యే ఫోన్‌ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని నానాజీకి అధికారులు చెప్పారు. నిర్ణయం తీసుకోకముందే యువకులు మళ్లీ శనివారం రోజున మైదానానికి వచ్చారు. వాలీబాల్‌ నెట్‌ కడుతుండగా, డాక్టర్‌ ఉమామహేశ్వరరావు అడ్డుకున్నారు. అనుమతులు వచ్చే వరకు ఆగాలని సూచించారు. దీంతో ఆ యువకులు నేరుగా ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు.

‘ మిమ్మల్ని ఉమామహేశ్వరరావు తిట్టారు’ అంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే పంతం హుటాహుటిన ఆర్‌ఎంసీ మైదానానికి వచ్చారు. ప్రొఫెసర్‌ ఉమామహేశ్వరరావుపై రాయలేని తిట్ల దండకాన్ని అందుకున్నారు. లం…కొడకా… చంపేస్తా… అంటూ దూసుకెళ్లారు. ఆయన ఫేస్‌ మాస్క్‌ను దురుసుగా తొలగించారు. చెయ్యెత్తి కొట్టడానికి ప్రయత్నించారు. ఈలోగా వెనుక నుంచి ఎమ్మెల్యే మేనల్లుడు బన్నీ ప్రొఫెసర్‌ ఉమామహేశ్వరరావుపై చేయి చేసుకున్నారు. ‘ సార్‌ మిమ్మల్ని నేను తిట్టలేదు. వారు చెపుతున్న దానిలో వాస్తవం లేదు’ అంటూ ప్రొఫెసర్‌ చెపుతున్న వివరణను ఎమ్మెల్యే వినే ప్రయత్నం చేయలేదు. అంతా కలసి డాక్టర్‌ను నెట్టేశారు. దీంతో ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Also Read : KTR : టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పై భగ్గుమన్న కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!