Arvind Kejriwal : పీఎం మోదీ టార్గెట్ గా అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు

అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగం చూస్తే ఆయన ప్రధాని మోదీని టార్గెట్ చేశారనే విషయం స్పష్టమవుతోంది...

Arvind Kejriwal : ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కేజ్రీవాల్ దేశ రాజకీయాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. సీఎం పదవికి రాజీనామా తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాటుచేసిన జనతా అదాలత్‌లో తొలిసారి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాత రోజులను గుర్తుచేసుకున్న కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రజల మధ్య ఉండటం సంతోషంగా ఉందన్నారు. 2011 జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం చేపట్టిన ఉద్యమాన్ని గుర్తుచేసుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద అవినీతి వ్యతిరేక ఉద్యమం ఏప్రిల్ 4, 2011న జంతర్ మంతర్‌లోనే ప్రారంభమైందన్నారు.

అప్పటి ప్రభుత్వం అహంకారంతో తమ మాట వినలేదని, ఎన్నికల్లో చూపిస్తామంటూ సవాల్ విసిరారని తెలిపారు. తాము ఎన్నికల్లో పోటీ చేసి ఢిల్లీలో తొలిసారి ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని కేజ్రీవాల్ తెలిపారు. ఎన్నికల్లో నిజాయితీగా పోరాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత పదేళ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పదేళ్లుగా నిజాయితీగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని తెలిపారు. ప్రధాని మోదీ తమపై కుట్ర పన్ని పార్టీ నేతలను జైల్లో పెట్టించారని ఆరోపించారు.

Arvind Kejriwal Comment

అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగం చూస్తే ఆయన ప్రధాని మోదీని టార్గెట్ చేశారనే విషయం స్పష్టమవుతోంది. తనపై ప్రధాని మోదీ కుట్ర చేశారని చెప్పడం దీనిలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా దేశ రాజకీయాల్లోనూ తన సత్తా చాటేందుకు కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికోసమే సీఎం పదవికి రాజీనామా చేశారనే చర్చ జరుగుతోంది. సీఎంగా ఉంటే ప్రభుత్వ నిర్వహణలో బిజీగా ఉండాల్సి వస్తోంది. పార్టీ వ్యవహరాలను పట్టించుకోవడానికి తక్కువ సమయం ఉంటుంది.

ఈ నేపథ్యంలో సీఎంగా రాజీనామా చేస్తే పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు.. ప్రజల్లో ఎక్కువుగా ఉండొచ్చనే ఆలోచనతోనే కేజ్రీవాల్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన పాదయాత్రను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా కేజ్రీవాల్ ఓ భారీ యాత్రను చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ(PM Modi) వైఫల్యాలను లేవనెత్తడంతో పాటు.. బీజేపీ వ్యతిరేకులను ఐక్యం చేసేందుకు కేజ్రీవాల్ ఓ భారీ వ్యూహం రూపొందించారనే చర్చ జరుగుతోంది. జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన సభను తొలి అడుగుగా పేర్కొంటున్నారు.

దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత పెరుగుతుందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఆప్‌ను దేశ వ్యాప్తంగా మరింత బలంగా విస్తరించాలనే ప్లాన్‌లో కేజ్రీవాల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆప్‌ బలపడితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి దేశ వ్యాప్తంగా పోటీచేసినా.. పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు దక్కించుకోవచ్చనే ఆలోచనలో ఆప్ కన్వీనర్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కేజ్రీవాల్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారనేది త్వరలోనే క్లారిటీ రానుంది.

Also Read : Amit Shah : ఉగ్రవాదాన్ని అంతం చేసేంతవరకు పాక్ తో చర్చలకు తావులేదు

Leave A Reply

Your Email Id will not be published!