CM Chandrababu : స్పెషల్ ఫ్లైట్ లో రతన్ టాటా పార్థివదేహానికి నివాళులర్పించేందుకు బాబు
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు...
CM Chandrababu : ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూశారు. రతన్ టాటా మృతిపట్ల ప్రధాన మోడీ సహా ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా టాటా మృతిపట్ల సంతాపం తెలిపారు. అలాగే రతన్ టాటా మృతి నేపథ్యంలో ముంబై వెళ్లాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రతన్ టాటా పార్థివదేహానికి ఇరువురు నివాళులు అర్పించనున్నారు. ఈరోజు ఉదయం 11:45 గంటలకు వెలగపూడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో గన్నవరం వెళ్లనున్నారు. 12 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబై చేరుకోనున్న సీఎం చంద్రబాబు, లోకేష్… 3 గంటలకు నారిమన్ పాయింట్‌లోని ఎన్‌సీపీఏ లాన్స్‌లో రతన్ పార్థీవదేహానికి నివాళులు అర్పించనున్నారు. తిరిగి 3:30 గంటలకు అమరావతికి సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు.
CM Chandrababu Visit..
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కొందరు మాత్రమే తమ అడుగుజాడలు వెళుతూ వెళుతూ ఈ భూమిపై వదిలి వెళతారని, తమ దూరదృష్టి, సమగ్రతలతో రతన్ టాటా అదే చేశారని అన్నారు. మనం కేవలం ఒక గొప్ప వ్యాపారవేత్తనే కాదు గొప్ప మానవతావాదిని కోల్పోయామని, కేవలం పారిశ్రామిక వారసత్వంలోనే కాకుండా ఆయన అందరి హృదయాలను స్పృశించి వెళ్ళారన్నారు. ఆయన పారిశ్రామిక రంగానికి చేసిన సేవ, జాతి నిర్మాణం లోనూ, పరోపకారి గుణంలోనూ తరతారాలలో మార్పును తెచ్చిందని కొనియాడారు. ఆయన గొప్ప వారసత్వాన్ని మనకు వదిలి వెళ్ళారని, టాటా గ్రూప్‌కు, ఆయనను ప్రేమించేవారికి బాధా తప్త హృదయంతో సంతాపం తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu) సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.
మంత్రి లోకేష్
విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా అని మంత్రి లోకేష్ అన్నారు. దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయమని అన్నారు. టాటా గ్రూప్ ఉత్పాదనలు వాడని భారతీయులు ఉండరని, మన దేశంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా భారీ విరాళంతో స్పందించే మానవత్వపు హృదయం రతన్ టాటాదని, నిజాయితీని, నిస్వార్ధపరత్వాన్ని టాటా బ్రాండ్‌గా చేసిన రతన్ టాటాకు మరణం లేదని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారని అన్నారు. నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ మనందరినీ ప్రతిరోజూ చిరునవ్వుతో పలకరిస్తూనే ఉంటారని.. రతన్ టాటా నిరుపమానమైన సేవలను స్మరిస్తూ, అశ్రు నివాళులు అర్పిస్తున్నానని మంత్రి లోకేష్ అన్నారు.
Also Read : AP Deputy CM : విద్యా సంస్థలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏపీ డిప్యూటీ సీఎం