KTR : కేటీఆర్ పిటిషన్ పై ఈరోజు నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో విచారణ
2014-2023 వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశానని....
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి కొండ సురేఖపై దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్(KTR) క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు నాంపల్లి స్పెషల్ ఎక్సైజ్ కోర్టు విచారించనుంది. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను సాక్షులుగా కేటీఆర్ పేర్కొన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటిఆర్(KTR) పిటిషన్ దాఖలు చేశారు.
KTR Case..
2014-2023 వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశానని.. 5 సార్లు వరుసగా సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నానని.. 9 ఏళ్లు మంత్రిగా పనిచేశానని.. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నానని కేటీఆర్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నానని, మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ది చేశానన్నారు. ప్రపంచంలోని బహుళజాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా పనిచేశానని, తెలంగాణా వేగంగా అభివృద్ది చెందడంలో కృషి చేశానన్నారు. మంత్రి కొండా సురేఖ వాఖ్యలు తన పరువుకు తీవ్ర నష్టం చేకూర్చాయంటూ.. ఆమె మాట్లాడిన వీడియో, ఆడియో టేపులను కేటీఆర్ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. బీఎన్ఎస్ యాక్ట్ 356 సెక్షన్ కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ.. 23 రకాల ఆధారాలను న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు.
కాగా అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి అనేక కామెంట్స్ కూడా చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్‌లో పిటిషన్ వేశారు. తనపై చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేటీఆర్ వేసిన పిటిషన్‌పై ఈనెల 10వ తేదీన విచారణ ప్రారంభమై.. సోమవారం నాటికి వాయిదా పడింది. ఈరోజు విచారణ జరగనుంది. మరోవైపు ఇదే కేసులో ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టుకు నాగార్జున వ్యక్తిగతంగా హాజరయ్యారు. మరోవైపు నాగార్జున మేన కోడలు సుప్రియ కూడా ఈ కేసులో నాగార్జున తరుపున కోర్టుకు హాజరయి.. సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చారు. అలాగే నాగ్ కుటుంబ సభ్యులు కూడా కోర్టులో సాక్షి వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read : Rain Alert : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్షాలు