PMMY 2024-25 : పీఎం ముద్ర రుణాల రుణ పరిమితిని రెండు రేట్లు పెంచిన కేంద్రం
తరుణ్ రుణాలకు తాజాగా మరోకొత్త రుణాన్ని జత చేశారు...
PMMY : కేంద్ర బడ్జెట్ 2024-25లోనే ముద్ర రుణాల రుణ పరిమితి(PMMY) పెంచుతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అందుకు తగినట్లే శుక్రవారం ముద్ర రుణాల(PMMY) లోన్ పరిమితిని రెండు రెట్లు పెంచారు. బడ్జెట్‌లో ఇచ్చిన హామీ మేరకు తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో.. ముద్ర పథకం కింద లోన్ పొందే మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. రుణాల అందజేత ప్రక్రియ తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం రుణాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ రుణాల్లో మొత్తం 3 రకాల రుణాలు ఉంటాయి. శిశు రుణాల కింద రూ. 50 వేల వరకు లోన్ పొందవచ్చు. కిశోర రుణాల కింద రూ. 50 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు.. తరుణ్ రుణాల కింద రూ. 5-10 లక్షల వరకు రుణం పొందవచ్చు.
PMMY 2024-25 Updates
తరుణ్ రుణాలకు తాజాగా మరోకొత్త రుణాన్ని జత చేశారు. తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీని తీసుకొచ్చి.. దీని కింద రూ. 10 లక్షల నుంచి 20 లక్షల రుణ సదుపాయాన్ని కల్పిస్తూ కేంద్రం నిర్ణయించింది. ఇది వరకు తరుణ్ లోన్లు పొంది తిరిగి చెల్లించిన వారికే ఈ లోన్లు అందుతాయని తెలిపింది. అంతే కాకుండా రూ. 20 లక్షల వరకు ఉన్న పీఎంఏవై లోన్ హామీ కవరేజ్.. మైక్రో యూనిట్ల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కింద అందించనున్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిధులు సమకూర్చాలన్న కేంద్ర ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు అందించడం కోసం పీఎంఏవై పథకాన్ని.. 2015 ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రుణాలను పీఎంఏవై కింద ముద్ర రుణాలు(PMMY)గా వర్గీకరించారు. వీటిని మెంబర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లు అందిస్తాయి. అంటే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో-ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్‌లు రుణాలు ఇస్తుంటాయి.
ఈ పథకం కింద పొందే లోన్‌తో డైరీ, తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ తదితర వ్యవసాయ అనుబంధ బిజినెస్‌లు, పలు రకాల సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు చేసుకోవచ్చు. ఉన్న ఊర్లోనే ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కల్పించేందుకు ఈ రుణాలు ఉపయోగపడనున్నాయి. ముద్ర లోన్ వడ్డీ రేట్లు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో 9.15 – 12.80 శాతం వరకు, ప్రైవేట్ బ్యాంకుల్లో 6.96 నుంచి 28 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. రుణ గ్రహీత రిస్క్ ప్రొఫైల్, రుణ కాలవ్యవధి, ఎంత లోన్ తీసుకున్నారనే దానిని బట్టి వడ్డీ రేట్లు మారతాయి. ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఎవరైనా ముద్ర రుణాలు పొందవచ్చు.
Also Read : Minister Kishan Reddy : మూసీ సుందరీకరణకు సీఎం రేవంత్ సవాల్ కు సిద్ధమంటున్న కేంద్రమంత్రి