KTR : తెలంగాణ రెవిన్యూ మంత్రి టార్గెట్ గా మాజీ మంత్రి ఘాటు విమర్శలు
ఈ ప్రభుత్వానికి ‘‘అక్రమ కేసులపై ఉన్న మోజు - ఆరోగ్య శాఖపై లేకపాయే....
KTR : తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉందన్నారు. మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేసి నెల రోజులు కావస్తోందని, ఈడీ దాడులపై బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట కూడా ఎందుకు లేదని ప్రశ్నించారు. భారీగా డబ్బు దొరికినట్లు మీడియాలో వార్తలు వచ్చినా కేసు నమోదు చేయలేదని విమర్శించారు. దాడులు ముగిసిన వెంటనే హైదరాబాద్‌లో అదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా సమావేశమయ్యారని, బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్విడ్ ప్రోకో కాక మరేమిటని కేటీఆర్(KTR) నిలదీశారు.
KTR Tweet..
ఈ ప్రభుత్వానికి ‘‘అక్రమ కేసులపై ఉన్న మోజు – ఆరోగ్య శాఖపై లేకపాయే.. అడ్డగోలు సంపాదన పై మోజు-పెద్దాసుపత్రుల ఆలన పాలనపై లేకపాయే.., కుటిల రాజకీయాలపై ఉన్న మోజు – రోగుల కష్టాలపై లేకపాయే..; ముళ్ల కంచెలపై ఉన్న మోజు- ఆసుపత్రుల్లో మందుల కొరతపై లేకపాయే.., పోలీసు ఉద్యోగాలు ఊడపీకడంపై ఉన్న మోజు – ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతపై లేకపాయే.., గుండె పట్టేస్తుంది ఆయాసంగా ఉందనివస్తే పక్కనున్న ప్రయివేట్ ఆసుపత్రికి పొమ్మన్నట్టే… పైసలే ప్రామాణికమైన మీ పైసల పాలనలో అన్ని రంగాల్లో అవేదనలు, అవస్థలు, అన్యాయాలే’’ అంటూ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
కాగా ‘‘హైడ్రా ఎక్కడ తన ఇల్లు కూల్చివేస్తుందో అని మూడు రోజులపాటు ఆందోళన చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇది ముమ్మాటికీ హైడ్రా అనే అరాచక సంస్థ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి చేయించిన హత్య. రేవంత్, హైడ్రాపై హత్య కేసు నమోదు చేయాలి’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైడ్రాను బ్లాక్ మెయిల్ సంస్థగా మార్చి, పేదల ఇళ్లను కూల్చుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టిస్తోందన్నారు. కూకట్‌పల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన బుచ్చమ్మ కుటుంబాన్ని సోమవారం కేటీఆర్ పరామర్శించారు. బుచ్చమ్మ కుటుంబ సభ్యులకు వైద్య సాయం అందించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. బుచ్చమ్మ భర్తకు రూ.50 వేలు అందించారు.
అదేవిధంగా మాదాపూర్‌లోని సున్నం చెరువులో హైడ్రా అధికారులు కూల్చివేసిన ఇళ్ల బాధితులను కేటీఆర్ పరామర్శించారు. ఇల్లు కోల్పోయిన చిన్నారి వేదశ్రీతో మాట్లాడారు. చిన్నారికి స్కూల్ బ్యాగ్, పుస్తకాలు, ఆర్థికసాయం అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. సీఎం సోదరుడి ఇంటికి నోటీసులు ఇచ్చిన అధికారులు.. పేదల ఇళ్లను నేరుగా ఎలా కూలుస్తారని నిలదీశారు. ఆర్థిక మంత్రికి.. హైడ్రాకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఐదుగురు బిల్డర్ల పేర్లు ఎలా చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్ పాలనలో బంగారు తెలంగాణ బక్కచిక్కిన రాష్ట్రమైంది. నీ కాసుల కక్కుర్తి నిర్ణయాలతో రాష్ట్రం అధోగతిపాలైంది’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై ఎక్స్ వేదికగా కేటీఆర్ మండిపడ్డారు. ‘‘ దసరాకే కాకుండా.. దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మూలుగుతున్నా.. వడ్లు కొనాలని అధికారులను ఆదేశించడం లేదు. ఇకనైనా ధాన్యం కొనుగోళ్లు చేపట్టండి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Maharashtra Election : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ కు నేడే చివరి రోజు