TG HYDRA : కూల్చివేతలకు తాత్కాలిక విరామం పలికిన ‘హైడ్రా’
హైడ్రా అధికారులు వస్తున్నారన్న విషయం తెలిసి స్థానికులు పెద్దసంఖ్యలో గుమిగూడారు...
HYDRA : ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను చెరబట్టిన వారిపై కన్నెర్ర చేసిన హైడ్రా(HYDRA).. తాజాగా రూటు మార్చింది. ఆక్రమణల కూల్చివేతలకు తాత్కాలిక విరామం ఇస్తూ.. చెరువులు, కుంటల పునరుద్ధరణకు రంగంలో దిగింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం అంబర్‌పేటలోని బతుకమ్మకుంట, తార్నాకలోని ఎర్ర చెరువును పరిశీలించారు. బతుకమ్మకుంట పునరుద్ధరణ పనులను దగ్గరుండి మొదలుపెట్టించారు. పొక్లెయినర్లతో చెట్లు, మొక్కల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఆక్రమణలు పోను మిగిలిన 5.15 ఎకరాల చెరువు పునరుద్ధరణ, పార్కు అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుల అధ్యయనం నిమిత్తం ఇటీవల బెంగళూరుకు వెళ్లి వచ్చిన అధికారులు.. వెంటనే చర్యలు ప్రారంభించారు.
TG HYDRA…
హైడ్రా అధికారులు వస్తున్నారన్న విషయం తెలిసి స్థానికులు పెద్దసంఖ్యలో గుమిగూడారు. కూల్చివేతలు జరుగుతాయన్న ప్రచారంతో పనులకు వెళ్లకుండా వేచిచూశారు. బతుకమ్మకుంట, రామకృష్ణహట్స్ వాసులు తమ ఇళ్లను నేలమట్టం చేస్తారేమోనని ఆందోళన చెందారు. బతుకమ్మకుంట వద్దకు వచ్చిన కమిషనర్ రంగనాథ్ నేరుగా స్థానికులతో మాట్లాడారు. ‘ఎవరి ఇళ్లు కూల్చం, ప్రస్తుతం ఉన్న చెరువును అభివృద్ధి చేస్తాం. శుభ్రపర్చి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దుతాం. ఫలితంగా మీ ఇళ్ల ధరలూ పెరుగుతాయి. ఆందోళన చెందవద్దు. తప్పుడు ప్రచారం నమ్మొద్దు’ అని సూచించడంతో ఊపిరిపీల్చుకొని చెరువు పునరుద్ధరణకు సహకరిస్తామన్నారు.
తార్నాకలోని ఎర్రకుంట చెరువును కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. స్థానిక నాగార్జున సొసైటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు అక్కడికి వెళ్లిన ఆయన చెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 5.9 ఎకరాల్లో ఉన్న చెరువులో నీటి నిల్వ సామర్ధ్యం పెంచడంతోపాటు.. బండ్, వాకింగ్ ట్రాక్ వంటివి నిర్మించనున్నారు. ప్రస్తుతమున్న దోమల బెడద కూడా తగ్గుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
Also Read : IAS Shikha : రాష్ట్ర సర్వీసుల నుంచి కేంద్ర సర్వీసులకు బదిలీ అయిన ఐఏఎస్ శిఖా