Anand Mahindra : విమర్శించిన నెటిజన్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
అందం అనేది చూసే కళ్లల్లో ఉంటుందన్న మాట వాస్తవమే కానీ హ్యండాయ్ కార్లతో పోలిస్తే మీ డిజైన్లు తీసికట్టుగా ఉంటాయి...
Anand Mahindra : సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra)..సమకాలీన ఆస్తికర అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే, తన కంపెనీ కార్లపై తాజాగా ఓ నెటిజన్ చేసిన తీవ్ర విమర్శలకు హుందాగా జవాబిచ్చి విమర్శకుడితో సహా నెటిజన్ల మెప్పు పొందారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సుశాంత్ మెహతా అనే నెటిజన్ మహీంద్రా కార్లను తీవ్ర రీతిలో విమర్శిస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘గాల్లో మేడలు కట్టే బదులు ముందు మీరు మహీంద్రా కార్లలో నాణ్యతా లోపాలు, సర్వీసింగ్ సమస్యలను పరిష్కరించండి. సర్వీసెంటర్లు, స్పేర్ పార్ట్స్ లభ్యత, ఉద్యోగుల ప్రవర్తన అన్నింటా సమస్యలే’’
Anand Mahindra Tweet..
‘‘మీ ప్రతి ఉత్పత్తిలోనూ ఏదోక లోపం ఉంటుంది. కార్ల డిజైన్ కూడా దిగదుడుపే. అందం అనేది చూసే కళ్లల్లో ఉంటుందన్న మాట వాస్తవమే కానీ హ్యండాయ్ కార్లతో పోలిస్తే మీ డిజైన్లు తీసికట్టుగా ఉంటాయి. కొన్నింట్లో అతి చేస్తే మరికొన్ని పేడలా ఉంటాయి. Be6e కూడా ఇందుకు మినహాయింపు కాదు. దీని డిజైనే వింతగా ఉంది. మీ డిజైన్ టీమే ఇలా ఆలోచిస్తుందా లేక మీకు కూడా సరైన అభిరుచి లేదో నాకు అర్థం కావట్లేదు. మంచి విశ్వసనీయత, నాణ్యత ఆశించే వారికి మీ కార్లు తగవేమో అనిపిస్తుంది. మీతో పాటు టాటాలు కూడా ప్రపంచస్థాయి కార్లు తయారు చేయాలని ఆశిస్తున్నా. కానీ ఇప్పటివరకూ నాకు నిరాశే మిగిలింది’’ అంటూ చెడామడా విమర్శించేశాడు.
ఇంత తీవ్ర విమర్శలతో కూడిన ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఊహించని విధంగా సమాధానమిచ్చారు. ‘‘ సుశాంత్.. మీరన్నది కొంత వరకూ నిజమే. మేము చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. కానీ ఇప్పటివరకూ మా ప్రయాణాన్ని ఒక్కసారి తరచి చూడండి. నేను 1991లో కంపెనీలో తొలిసారిగా చేరే సమయానికి భారత్ అప్పుడే ప్రపంచీకరణకు తలుపులు తెరిచింది. దేశంలోకి వచ్చే అంతర్జాతీయ బ్రాండ్లతో మేము పోటీ పడలేమని ఓ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ సలహా ఇచ్చింది. ఈ రంగం నుంచి వెంటనే వైదొలగాలని సూచించింది’’
‘‘మూడు దశాబ్దాలు గడిచాక మేము ఈ రంగంలో నిలదొక్కుకోవడమే కాకుండా ప్రపంచ బ్రాండ్లకు గట్టిపోటీ ఇస్తున్నాము. మీ పోస్టులాగా దురుసు విమర్శలను, అపనమ్మకాన్ని మాకు అనుకూలంగా మార్చుకుని విజయం వైపు దూసుకెళుతున్నాం. యస్.. మా ప్రయాణం ఇంకా చాలా ఉంది. అలసత్వానికి తావు లేదు. నిరంతరం మెరుగుపరుచుకోవడమే మంత్రంగా మేము ముందుకు సాగుతాం. మా తపనను మరింతగా పురిగొల్పినందుకు మరోసారి మీకు థాంక్యూ.. ’’ అంటూ రిప్లై ఇచ్చారు. తన తీవ్ర విమర్శలకు ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) హుందాగా జావాబివ్వడంతో సుశాంత షాకైపోయారు. ‘‘ ఓమైగాడ్.. నా విమర్శను నిర్మాణాత్మక సూచనగా తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా ట్వీట్ చూసి మీ టీం కాల్ చేసింది. వారు హర్ట్ అయ్యుంటారని భావించి ట్వీట్ డిలీట్ చేశా’’ అంటూ ఆశ్చర్యపోయారు.
Also Read : MLA Harish Rao : సీఎం రేవంత్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు