Minister Parthasarathy : ధాన్యం అమ్మకాల్లో రైతుల మోసపోవద్దంటున్న మంత్రి పార్థసారథి
Parthasarathy : జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, పార్థసారథి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి పార్థసారథి(Parthasarathy) మాట్లాడుతూ.. ధాన్యం తేమ శాతం 17% నుంచి 25% వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. బయట తక్కువ ధరకే అమ్ముకొని రైతులు మోసపోవద్దన్నారు. రైతుల దగ్గర్నుంచి ప్రతి గింజ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
Parthasarathy Comment
మిల్లర్లు ఎవరైనా సరే తేమ శాతం ఎక్కువ ఉందని రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రైతు భరోసా కేంద్రాల్లో వారితో పాటు మిల్లర్లు కూడా ఒకళ్ళు అందుబాటులో ఉండాలన్నారు. తేమశాతం పరిశీలించి ఫైనల్ చేయాలని సూచించారు. గత వైసీపీ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన ఆరు ఏడు నెలలకు గాని డబ్బులు రైతులు ఎకౌంట్లో పడేవి కాదని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వస్తున్నామని మంత్రి పార్థసారథి(Parthasarathy) వెల్లడించారు.
వర్షాలకు రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. కూటమి ప్రభుత్వం హయంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా పంట కొనుగోలు చేస్తున్నామన్నారు. మిల్లర్లు అవకతవకలు చేస్తే అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. రైతులెవరు నష్టపోవద్దని.. ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గతంలో ధాన్యం కొనుగోలు చేసిన ఆరు ఏడు నెలలకు కూడా డబ్బులు పడతాయో లేదో తెలిసేది కాదన్నారు. వైసీపీ పార్టీ నాయకులు బ్రోకర్లు అవతారమెత్తి రైతులను మోసం చేశారని నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేమూరునియోజకవర్గంలో పట్టపగలే లైట్లు వెలుగుతుండడంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా పగటి పూట విద్యుత్ దీపాలు వెలగడాన్ని ఫోటోలు తీసి పంపిస్తున్నారని తెలిపారు. విద్యుత్‌ను అవసరాల మేరకు మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యుత్‌ను వృథా చేయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పగటి పూట కూడా విద్యుత్ దీపాలు వెలగడంతో సంస్థపై భారం పడుతోందన్నారు. పగటిపూట వీధి దీపాలు వెలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలంటూ ఉన్నతాధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read : YS Sharmila : అదానీ సోలార్ ఒప్పందాలు పై సీబీఐకి ఫిర్యాదు చేసిన షర్మిల