MLA KTR : రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం
‘అదానీ, రేవంత్‌రెడ్డి ఫొటోతో ఉన్న టీషర్ట్ ధరించి అసెంబ్లీకి వెళ్తే తప్పేమిటి...
KTR : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నలవర్షం కురిపించారు. పార్లమెంట్లో ఒకలా.. తెలంగాణ అసెంబ్లీలో మరోలా కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించవద్దని హితవు పలికారు. ఈ మేరకు కేటీఆర్(KTR) ట్విట్టర్(ఎక్స్) వేదికగా పోస్ట్ చేశారు. ‘‘పార్లమెంట్లో అదానీ-మోదీ ఫొటో ఉన్న టీ షర్ట్ ధరించడం మీకు సరైనదే అయితే.. మీ అడుగుజాడల్లో నడిచి తెలంగాణ అసెంబ్లీలో అదానీ-రేవంత్ వ్యవహారాన్ని బయటపెట్టడానికి మాకు ఎందుకు అనుమతి లేదు’’ అని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ‘అదానీ, రేవంత్‌రెడ్డి ఫొటోతో ఉన్న టీషర్ట్ ధరించి అసెంబ్లీకి వెళ్తే తప్పేమిటి. ఏ దుస్తులు వేసుకుని రావాలో స్పీకర్ చెబుతారా. అదానీ, మోదీ ఫొటో ఉన్న టీషర్ట్ ధరించి రాహుల్‌గాంధీ పార్లమెంటులోకి వెళ్తే ఆయనను ఎవరూ అడ్డుకోలేదు. మేం రాహుల్‌గాంధీనే అనుసరించాం. కానీ, ఎందుకు అనుమతించటం లేదు’’ అని కేటీఆర్ నిలదీశారు.
MLA KTR Comments
అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన సోమవారం.. ‘అదానీ, రేవంత్ భాయీ భాయీ’ అనే నినాదంతో కూడిన ఫొటోలున్న టీషర్టులు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలోకి రావటానికి ప్రయత్నించారు. అయితే, వారిని పోలీసులు అరెస్టుచేసి తెలంగాణ భవన్‌కు తరలించారు. ఈ సందర్భంగా, కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్, ప్రియాంకలతో సహా 100 మంది ఎంపీలు అదానీ, ప్రధాని మోదీ బొమ్మ వేసుకొని పార్లమెంటు లోపలికి వెళ్లవచ్చు గానీ తెలంగాణలో మాత్రం తమను అసెంబ్లీ లోపలికి అనుమతించకపోవటం ఏమిటని కేటీఆర్ నిలదీశారు.
పార్లమెంటులోఒక నీతి, శాసనసభలో మరో నీతి ఎలా ఉంటుందని నిలదీశారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, లగచర్ల ప్రజల తరఫున నిరసన తెలిపేందుకు అసెంబ్లీకి వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అదానీకి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే.. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అదానీకి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు.సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి డబ్బు సంచులు పంపిస్తున్న కారణంగానే.. అదానీతో ఆయన వ్యాపార లావాదేవీలపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహించిందని కేటీఆర్ ఆరోపించారు.
Also Read : Karnataka Ex CM : కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ దుర్మరణం