Delhi Elections : దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పైనే ఉన్నాయి. ఎన్నికల తేదీలను ఈసీ ఇంకా ప్రకటించనప్పటికీ మరోసారి అధికారంలో కొనసాగేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ పీఠం ఈసారి కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ(BJP) ఉన్నాయి. కాగా, ఢిల్లీ బీజేపీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ(Virendraa Sachdeva) ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇప్పటికే విడుదల చేయగా, బీజేపీ ఇంతవరకూ అభ్యర్థుల జాబితాను ప్రకటించ లేదు. 2015 నుంచి ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది. అయితే 2014 నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీ 7 లోక్‌సభ సీట్లను ఎగురేసుకుపోయింది.
Delhi Elections – BJP Chief…
ఈఏడాది ఫిబ్రవరి లోగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇందుకు సన్నాహకంపై బీజేపీ, ఆప్ పోటీపోటీ పోస్టర్ల వార్‌కు దిగాయి. విమర్శలు, ప్రతివిమర్శలు గుప్పించుకున్నాయి. తాజాగా ‘లెటర్ వార్’ కూడా జరుగుతోంది. ఢిల్లీ బీజేపీ చీఫ్ సచ్‌దేవ జనవరి 1న కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. అబద్ధాలు, వంచన వంటి చెడు అలవాట్లను వదులుకోవాలని కేజ్రీవాల్‌కు ఆ లేఖలో ఆయన సూచించారు. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం వచ్చిందంటే చెడు ఆలవాట్లు వదులుకుని, కొత్తగా మంచి తీర్మానాలు చేస్తుంటారని, ఈరోజు నుంచి మీరు అబద్ధాలు, మోసాలు వంటి చెడు అలవాట్లు వదులుకోవాలని ఢిల్లీ వాసులంతా కోరుకుంటున్నారని ఆ లేఖలో సచ్‌దేవ్ పేర్కొన్నారు. లిక్కర్‌ను ప్రమోట్ చేసినందుకు ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దీనికి ముందు కేజ్రీవాల్ సైతం ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భాగవత్‌కు లేఖ రాశారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నీరుగారుస్తోందని, ఆ పార్టీ తప్పిదాలకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తోందా అని భాగవత్‌ను ప్రశ్నించారు. దీనిపై బీజేపీ వెంటనే స్పందించింది. ఆర్ఎస్ఎస్ నుంచి కేజ్రీవాల్ మందుగా సేవాభావం నేర్చుకోవాలని హితవు పలికింది.
Also Read : Vizag Steel Plant : ఉద్యోగులు షిఫ్ట్ మారుతున్న సమయంలో భారీ ప్రమాదం