HYDRA Complaints : ‘హైడ్రా’ నిర్వహించిన ప్రజావాణికి 89 ఫిర్యాదులు
ప్రాంతాల వారీగా ఉన్న అధికారులకు క్షేత్రస్థాయిలో పరిశీలించిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు...
HYDRA : బుద్ధభవన్‌లోని హైడ్రా(HYDRA) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. చెరువులు, పార్కులు, రోడ్ల ఆక్రమణలపై 89 ఫిర్యాదులు అందాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రాంతాల వారీగా ఉన్న అధికారులకు క్షేత్రస్థాయిలో పరిశీలించిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
HYDRA Complaints..
ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై గూగుల్ మ్యాప్, సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) చిత్రాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఫిర్యాదుదారులకు చూపించి క్షేత్రస్థాయి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అమీన్పూర్, పరిసర ప్రాంతాల నుంచి అధిక ఫిర్యాదులు వస్తోన్న నేపథ్యంలో ఆ మునిసిపాలిటీ పరిధిలో పూర్తిస్థాయి సర్వే చేయిస్తామని రంగనాథ్(AV Ranganath) పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా నిజాంపేట మునిసిపాలిటీ పరిధిలో మేడికుంట చెరువు 45 ఎకరాల్లో ఉండేదని, ఆక్రమణలతో చెరువు కుచించుకుపోయిందని వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు.
మాదాపూర్(Madhapur) గుట్టల బేగంపేటలోని సర్వే నెంబర్-32లో ప్లాట్ నెంబర్ 85 యజమాని రోడ్డును ఆక్రమిస్తున్నారని సైబర్‌హిల్స్ ప్లాట్ల యజమానుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు లింగిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్లాట్ వాస్తవ విస్తీర్ణం 276 చ.గ.లు కాగా.. మరో 124 చ.గ.లు ఆక్రమించి షెడ్డు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. మల్కాజ్‌గిరిలోని డిఫెన్స్ కాలనీలో ప్రజావసరాలకు కేటాయించిన 1000 చదరపు గజాల స్థలం స్థానిక ప్రజాప్రతినిధి కబ్జా చేస్తున్నారని డిఫెన్స్ కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది.
ఛత్రినాకలో రోడ్డు స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమిస్తున్నాడని, జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సిటీ ప్లానర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని గుడుమాని సాయికిరణ్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. మూసాపేటలోని ఆంజనేయనగర్ సర్వే నంబర్-9లో రెండువేల చదరపు గజాల పార్కు స్థలం కబ్జా అవుతోందని, అడ్డుకుంటే తమపై దాడికి దిగుతున్నారని రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. స్థలంలో పార్కు అభివృద్ధికి రూ.50 లక్షలు ప్రభుత్వం విడుదల చేసిందని, శంకుస్థాపన చేసిన అనంతరం కబ్జా ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు.
ఔటర్ వరకు చెరువుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఎఫ్టీఎల్) నిర్ధారణ పూర్తయితే ఆక్రమణలకు సంబంధించి చాలా ఫిర్యాదులు పరిష్కారమవుతాయని రంగనాథ్ పేర్కొన్నారు. నాలుగైదు నెలల్లో శాస్ర్తీయ విధానంలో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.అన్ని విభాగాల వద్ద ఉన్న రికార్డులు, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఎఫ్‌టీఎల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Also Read : Parawada Pharma Incident : పరవాడ ‘మెట్రో కెమ్ ఫార్మా’ లో భారీ అగ్ని ప్రమాదం