Chhattisgarh Encounter : కాలారి ఘాట్ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత చలపతి దుర్మరణం

మావోయిస్టు పార్టీ మాస్టర్‌ మైండ్స్‌లో చలపతి ఒకరు...

Chhattisgarh : వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్‌ జిల్లా కుల్హాడీఘాట్‌ అటవీ ప్రాంతంలో జనవరి 19వ తేదీ నుంచి వరుస ఎన్‌కౌంటర్లు జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి అలియాస్‌ చలపతి అలియాస్‌ జయరాం (62) మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్‌కౌంటర్‌లో మరణించడం మావోయిస్టు పార్టీ చరిత్రలోనే ఇదే తొలిసారి. చలపతిపై ఇప్పటికే పోలీసులు రూ.కోటి రివార్డు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Chhattisgarh Encounter Updates

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం ముత్యంపైపల్లెకు చెందిన శివలింగారెడ్డి, లక్ష్మమ్మ దంపతుల మూడో కుమారుడు చలపతి. తండ్రి సాధారణ రైతు. మత్యంలోనే ప్రాథమిక విద్య అభ్యసించిన చలపతి(Chalapathy).. బంగారుపాళెంలో పదో తరగతి, చిత్తూరులో డిగ్రీ ఒకేషనల్‌ కోర్సు చదివారు. ఆ తర్వాత 1990-91లో పీపుల్స్‌వార్‌ పార్టీ పట్ల ఆకర్షితుడై అజ్ఞాతంలోకి వెళ్లారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మావోయిస్టు పార్టీ బలోపేతం చేశారు. ఆ తర్వాత అనతి కాలంలోనే డివిజనల్‌ కమిటీ సభ్యుడిగా ఎదిగారు. 2010లో తోటి మావోయిస్టు అరుణ అలియాస్‌ చైతన్యను వివాహం చేసుకున్నారు. 2012లో ఓ దాడిలో చలపతి పొరపాటు వల్ల మరో కామ్రేడ్‌ మృతి చెందడంతో పార్టీ ఆయనను కొంతకాలం డీమోట్‌ చేసింది. ఇక చలపతి భార్య అరుణ 2019 మార్చిలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ప్రస్తుతం ఆయనపై రూ.కోటి రివార్డుంది.

మావోయిస్టు పార్టీ మాస్టర్‌ మైండ్స్‌లో చలపతి ఒకరు. మావోయిస్టు అగ్రనేత ఆర్‌కేకు అత్యంత సన్నిహితులు. ప్రస్తుతం పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌ వన్‌ కమాండర్‌గా ఉన్న మడావి హిడ్మాకు చలపతి గురువు. అయితే చలపతి ఎలా ఉంటారనేది చాలా ఏళ్ల పాటు పోలీసులకు తెలియరాలేదు. 2016లో ఓ మావోయిస్టు చనిపోగా.. అతని వద్ద దొరికిన ల్యాప్‌టాప్‌లో చలపతి, ఆయన భార్య అరుణ సెల్ఫీ వీడియో ఒకటి కనిపించింది. కాగా చత్తీస్‌ఘడ్‌లో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌లో చలపతితో సహా మొత్తం 24 మంది మరణించినట్లు సమాచారం. 16 మంది మృతదేహాలను ఇప్పటి వరకూ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో 8 మందిని అధికారికంగా గుర్తించారు.

చనిపోయిన వారిలో చలపతితో పాటు ఒడిశాలో మావోయిస్టు పార్టీ కీలక నేత మనోజ్, స్పెషల్‌ జోనల్‌ కమిటీ (ఎస్‌జడ్‌సీ) సభ్యుడు గుడ్డూ, ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. పలువురు మావోయిస్టులకు గాయాలైవగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో నుంచి ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్‌ లాంటి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని రాయ్‌పుర్‌ జోన్‌ ఐజీ అమ్రేశ్‌ మిశ్రా వెల్లడించారు.

ఛత్తీస్గఢ్(Chhattisgarh),ఒడిషా.. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని బాలుడిగ్గీ-కుల్హాడీఘాట్‌ అడవుల్లో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే నిఘావర్గాల సమాచారం అందడంతో దాదాపు వెయ్యి మంది జవాన్లు జనవరి 19న కూంబింగ్‌ ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం నుంచి నాలుగు డ్రోన్లతో మావోయిస్టుల స్థావరంపై గురిపెట్టింది. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి.మంగళవారం తెల్లవారుజామున మావోయిస్టు నేతల స్థావరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో ఇరువర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి.

Also Read : Minister Kishan Reddy : యువతకు కేంద్రం శుభవార్త..బొగ్గు గనుల శాఖలో 5 లక్షల ఉద్యోగాలు

Leave A Reply

Your Email Id will not be published!