CM Revanth-Davos Tour : 45వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న రేవంత్ సర్కార్

ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలో సుమారు 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా...

CM Revanth : దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ మరో సారి భారీ పెట్టుబడులను ఆకర్షించి కొత్త రికార్డు సాధించింది. ఇంధన రంగంలో ప్రముఖ సంస్థ సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందంపై (ఎంవోయూ) సంతకం చేసింది. ఈ ఒప్పందం ద్వారా నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు భారీ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు. ఇవి 5,440 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్తు ప్లాంట్లకు అనుసంధానం చేయబడతాయి.

CM Revanth Reddy Davos Tour

ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలో సుమారు 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. ప్రాజెక్టులు పూర్తయ్యాక స్థానిక ప్రజలకు భారీ స్థాయిలో ఉపాధి కల్పించబడుతుందని అధికారులు పేర్కొన్నారు. సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth), పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం, ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ ఒప్పందం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ, తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గత ఏడాది దావోస్‌(Davos)లో జరిగిన రూ.40 వేల కోట్ల పెట్టుబడుల రికార్డును ఈ ఒప్పందం సమం చేసిందని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. సన్ పెట్రో కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వీ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవడం తమకు గర్వకారణమని తెలిపారు.

రాష్ట్రంలోఇంత భారీ పెట్టుబడుల ఒప్పందం సాధించడం రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ ఒప్పందం రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనతో పాటు, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సుస్థిర ఇంధన వృద్ధికి కట్టుబడి ఉండగా, సన్ పెట్రో కెమికల్స్ వంటి సంస్థల భాగస్వామ్యం ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించనుంది. ఈ ఒప్పందంతో రాష్ట్రం సాధించిన విజయాలు దావోస్ వేదికపై మరింత వెలుగులోకి వచ్చాయి.

Also Read : CM Chandrababu : లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయడంపై చంద్రబాబు ఆసక్తికర రియాక్షన్

Leave A Reply

Your Email Id will not be published!