TG Assembly Meet : కులగణన నివేదికపై చర్చించనున్న అసెంబ్లీ

ఈ చర్చలో బీఆర్ఎస్‌, బీజేపీ సభ్యులనూ భాగస్వాములను చేసి....

TG Assembly : స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు అసెంబ్లీ, మండలి ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. సమగ్ర కులగణన సర్వే, స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై ముందుగా కేబినెట్ భేటీలో చర్చిస్తారు. అనంతరం ఈ నివేదికలపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ 42 శాతానికి పెంచుతామని, ఎస్సీ వర్గీకరణకు అనుకూలమంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌(Congress) ఇచ్చిన హామీలు ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. అయితే సీఎం రేవంత్ మాత్రం దీనిపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ చర్చలో బీఆర్ఎస్‌(BRS), బీజేపీ సభ్యులనూ భాగస్వాములను చేసి.. పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు.

TG Assembly Meet for…

ఈ సమావేశాల్లో బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరించబోతోందనే అంశంపై ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఓ సర్వేను చేపట్టారు. రాష్ట్రంలోని ప్రజల స్థితిగతులు తెలుసుకోవడానికి ఈ సర్వే చేపడుతున్నట్టు అప్పట్లో బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అయితే ఆ సర్వే వివరాలను గత కేసీఆర్ సర్కార్ ఎందుకు బయటపెట్టలేదన్నది కాంగ్రెస్‌, బీజేపీల నుంచి ఇప్పటికీ వినిపిస్తున్న వాదన. తాజాగా అదే అంశంపై బీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సర్వే ద్వారా ప్రజల స్థితిగతులు తెలుసుకుని ఎన్నికల్లో తాయిలాలు ఇచ్చేందుకు దాన్ని వాడుకున్నారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే అలాంటిది కాదన్నారు.

అయితే బీఆర్ఎస్ మాత్రం కులగణన సర్వేను తప్పుల తడక అని విమర్శిస్తోంది. సర్వే చేయకుండా కులగణన నివేదిక ఇచ్చారని.. ఎన్నికల కోసమే హడావుడి సర్వే చేశారని ఆరోపించారు మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్.. కులగణన సర్వేపై చర్చ కోసమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నప్పటికీ.. ఈ అంశంలో బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి, టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ముందస్తు వ్యూహంతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ఈ సమావేశంలో అధికార, విపక్షాల మధ్య ఏ రకమైన మాటల తూటాలు పేలబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read : Vice President Dhankhar : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తిన ఉపరాష్ట్రపతి

Leave A Reply

Your Email Id will not be published!