Sonia Gandhi : రాష్ట్రపతి ముర్ముపై కాంగ్రెస్ అధినేత్రి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రపతి ముర్ము ప్రసంగంపై సోనియా గాంధీ మీడియా వేదికగా స్పందిస్తూ....
Sonia Gandhi : బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.. అధికార, విపక్షపార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. అయితే.. పార్లమెంట్ బడ్జెట్ 2025 సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రసంగం తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.. ఈ వ్యాఖ్యలపై జాతీయ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. బీజేపీ సహా ఎన్డీఏ పార్టీలు సోనియా గాంధీని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై 21 మంది బిజెపి ఎంపీలు పార్లమెంటులో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఈ సంఘటన తర్వాత, రాష్ట్రపతి గిరిజన వర్గానికి చెందినవారు కాబట్టి ఆమెను కాంగ్రెస్ సహించలేకపోతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. దేశంలోని అత్యున్నత పదవిలో ఒక సాధారణ, పేదచ గిరిజన మహిళను సహించడంలో, గౌరవించడంలో కాంగ్రెస్ ఉన్నత వర్గాలకు అసౌకర్యంగా ఉందని బిజెపి, ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు విమర్శిస్తున్నాయి.. అయితే, కాంగ్రెస్ దీనిని బిజెపి కుట్రగా అభివర్ణించింది.
Sonia Gandhi Shocking Comments
వాస్తవానికి బడ్జెట్ సమావేశాలు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) ప్రసంగంతో ప్రారంభమయ్యాయి.. రాష్ట్రపతి ముర్ము ప్రసంగంపై సోనియా గాంధీ మీడియా వేదికగా స్పందిస్తూ..‘‘ రాష్ట్రపతి చివరి నాటికి చాలా అలసిపోయారు.. ఆమె మాట్లాడలేకపోయారు.. పూర్ ఉమెన్’’ అంటూ పేర్కొన్నార. సోనియా గాంధీ చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత గందరగోళం చెలరేగింది.
సోనియా గాంధీ ప్రకటన తర్వాత, రాష్ట్రపతి భవన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.. సోనియా గాంధీ ఆ వ్యాఖ్యలను అవమానకరమైనదిగా, రాష్ట్రపతి పదవి గౌరవానికి హాని కలిగించేదిగా అభివర్ణించింది. సత్యం కంటే గొప్పది ఏదీ లేదని రాష్ట్రపతి భవన్ పేర్కొంది.. రాష్ట్రపతి ఏ సమయంలోనూ అలసిపోయినట్లు కనిపించలేదు. నిజానికి, ఆమె తన ప్రసంగంలో చేసినట్లుగా, అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల కోసం మాట్లాడటంలో ఎప్పుడూ అలసిపోమని ఆమె నమ్ముతారు.. ఈ నాయకులకు హిందీ వంటి భారతీయ భాషల జాతీయాలు, ఉపన్యాసాలు తెలియకపోవచ్చు.. అందువల్ల వారు తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారని రాష్ట్రపతి కార్యాలయం విశ్వసిస్తోంది. ఏదేమైనా, ఇలాంటి వ్యాఖ్యలు చెడు అభిరుచి గలవి.. దురదృష్టకరం, పూర్తిగా ఆమోదయోగ్యం కానివి.. అంటూ పేర్కొంది.
కాంగ్రెస్ రాజకుటుంబం రాష్ట్రపతిని అవమానించేలా వ్యవహరించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గిరిజనుల గురించి కాంగ్రెస్ ఏమనుకుంటుందో మరోసారి చూపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పూర్ ఉమెన్ (పేద మహిళ) అని పిలిచి సోనియా గాంధీ గిరిజనులను అవమానించారు.. అంటూ మోదీ పేర్కొన్నారు.
జూలై2024లో.. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అంటూ సంబోధించారు. ఆమెను ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించినప్పుడు సభ లోపల, వెలుపల తీవ్ర గందరగోళం చెలరేగింది. ఆ సమయంలో కూడా, ముర్ము గిరిజన సమాజం నుంచి వచ్చారని… అందుకే కాంగ్రెస్ ఆమెను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తోందని బిజెపి ఆరోపించింది. అధిర్ రంజన్ చౌదరిపై చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేసింది.. అతని ప్రకటన గిరిజన సమాజంలోని అత్యున్నత స్థాయి మహిళను అవమానించిందని పేర్కొంది. అయితే, చౌదరి తన పేలవమైన హిందీని ఉటంకిస్తూ క్షమాపణలు చెప్పారు.. కానీ అతని నేపథ్యం కారణంగా కాంగ్రెస్ ఇలా తరచూ చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
Also Read : AP High Court Slams : విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డిపై భగ్గుమన్న హైకోర్టు