Teenmar Mallanna-Congress : కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీసులపై స్పందించిన తీన్మార్ మల్లన్న
ఇలా ప్రధాన పార్టీలు బీసీ మంత్రం పఠిస్తున్న వేళ...
Teenmar Mallanna : తెలంగాణ రాజకీయాల్లో బీసీ నినాదం హోరెత్తుతోంది. అలా ఇలా కాదు.. అగ్గి రాజేసినట్టే కనబడుతోంది. బీసీల సంఖ్యెంతో తేల్చేస్తామంటూ.. అధికార కాంగ్రెస్ సర్వే చేపడితే.. స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించాలంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరాడుతోంది. బీసీ సంఘం నేత కృష్ణయ్యను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసి.. ఆ వర్గానికి మేమూ పెద్దపీటే వేస్తామని చాటే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇలా ప్రధాన పార్టీలు బీసీ మంత్రం పఠిస్తున్న వేళ.. తెలంగాణలో తాజా పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.
Teenmar Mallanna Responds..
బీసీల విషయంలో తాము ఒకడుగు ముందే ఉండాలని ఉబలాటపడిన కాంగ్రెస్ పార్టీకి.. కులగణన సర్వే నివేదికను విడుదల రోజే ఊహించని షాక్ తగిలింది. బీసీల విషయంలో బీఆర్ఎస్, బీజేపీలకు తామేం తీసిపోమన్నట్టుగా దూకుడుమీదున్న హస్తం పార్టీ.. సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) తీరుతో హతవిధీ అన్నట్టుగా తలకొట్టుకుంటోంది. కులగణన చేసి చరిత్ర సృష్టించామని పార్టీ చెబుతుంటే… దాన్ని చెత్తబుట్టలో వేయాలంటూ మల్లన్న వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది. బీసీ సర్వే నివేదిక ప్రతులకు నిప్పు పెట్టడమూ.. అధికార కాంగ్రెస్‌ను కుదిపేసింది. అందుకే, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ.. మల్లన్నకు షోకాస్ నోటీసులు జారీ చేసింది.
బీసీ నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇతర వర్గాలతోనూ అంతే ఆదరణతో వ్యవహరించాలని భావిస్తోంది. అయితే, ఇటీవల బీసీ వర్గాలు నిర్వహించిన యుద్ధభేరి సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పాల్గొన్న తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)… రెడ్లు, వెలమలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. తన వర్గం గొప్పదని చెప్పుకోవడానికి.. అవతలి వర్గాలను కించపరిచేలా మాట్లాడటం కరెక్టు కాదన్న చిన్న సెన్స్‌ను ఆయన మిస్సయ్యారన్న అభిప్రాయం వ్యక్తవుతోంది.
ఉచ్చనీచాలు ఎంచుతూ.. తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్… అటూఇటూ తిరిగి కాంగ్రెస్ మెడకే చుట్టుకుంటున్నాయ్. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ.. ఆయన రెండువర్గాలను తీవ్రపదజాలంతో దూషించడం రచ్చకు దారితీసింది. ఇప్పటికే సొంత పార్టీలోని ఆయా వర్గాల నాయకులు.. మల్లన్నపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రభుత్వంలో మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా.. మల్లన్న తీరును తప్పుబట్టనివారు లేరు. ఆచితూచి మాట్లాడాలని పొన్నం అంటే.. ఆయన ఏ పార్టీవారో తేల్చుకోవాలన్నారు మరో మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
Also Read : Hero Vijay-TVK Party : కులగణనపై టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ కీలక వ్యాఖ్యలు