Prashant Kishor : ఎన్నికలకు టీవీకే పార్టీ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్
టీవీకే పార్టీ సిద్ధాంతాల గురించి, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు...
Prashant Kishor : ప్రముఖ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ప్రత్యేక సలహాదారుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నియమితులయ్యారు. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయమే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) వ్యూహ రచన చేయనున్నారు. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం విజయ్‌తో భేటీ అయిన ప్రశాంత్ కిశోర్.. టీవీకే పార్టీ సిద్ధాంతాల గురించి, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
Prashant Kishor As a..
అదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన, ప్రజలను ఆకట్టుకునే హామీల గురించి కూడా చర్చించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పార్టీ ఎన్నికల విభాగం ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున్ నివాసంలో ఆ పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా శాఖ కార్యదర్శులను ప్రశాంత్ కిషోర్ వరుసగా కలుసుకున్నారు. విక్రవాండిలో జరిగిన పార్టీ మహానాడులో డీఎంకే తనకు ప్రధాన రాజకీయ శత్రువని విజయ్ చేసిన ప్రకటనకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన స్పందన గురించి కూడా పార్టీ నాయకుల వద్ద ఆయన ప్రస్తావించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 14 నెలల గడువు మాత్రమే ఉండటంతో ఆలోగా పార్టీని పటిష్టం చేసి, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్‌షోలు నిర్వహించి ఆ ఎన్నికలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ప్రశాంత్ కిషోర్ సూచించారు. జిల్లా కార్యదర్శులు, డిప్యూటీ కార్యదర్శులు, కోశాధికారులతో ఆయన చర్చించారు. ఏళ్లతరబడి రాష్ట్ర ప్రజలకు పరిష్కారం కాని సమస్యలేమిటో తెలుసుకుని వాటిని పరిష్కరించేలా తక్షణమే చేపట్టాలని టీవీకే నేతలకు ఆయన సలహా ఇచ్చారు. వీలైతే వచ్చే నెల నుంచే విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయాలని, అప్పుడే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాస్త వెసులుబాటు వుంటుందని సూచించినట్లు తెలిసింది. టీవీకే జిల్లా కార్యదర్శులందరితోనూ ప్రశాంత్‌కిశోర్ వేర్వేరుగా మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ కూడా పాల్గొన్నారు.
Also Read : CM Chandrababu : సర్కారు ఉద్యోగులకు ఇకపై 1వ తారీకు నుంచి జీతాలు