Y V Subba Reddy : జగన్ ఎక్కడికి వెళ్లినా సర్కార్ జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి
దీనిపై కేంద్రం దృష్టి తీసుకువెళ్ళి న్యాయపోరాటం చేస్తామన్నారు...
Y V Subba Reddy : వైఎస్సార్‌సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి(Y V Subba Reddy) కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఉదయం ఆయన ప్రకాశంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి కక్ష సాధింపులకు పాల్పడుతోందని, రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, మిర్చి రైతుల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు.
Y V Subba Reddy Comments
గుంటూరు మిర్చి యాడ్‌కు వెళ్లిన జగన్(YS Jagan)కు భద్రత ఇవ్వకుండా హానికల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనిపై కేంద్రం దృష్టి తీసుకువెళ్ళి న్యాయపోరాటం చేస్తామన్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలన్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అవమాన పరుస్తున్నారని, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి కాబట్టే అసెంబ్లీకి వెళ్ళాలని జగన్ నిర్ణయించారని.. ఎవరికో భయపడి అసెంబ్లీకి రావడంలేదని వైవి సుబ్బారెడ్డి అన్నారు.
కాగా ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని ఇన్నాళ్లూ భీష్మించిన వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఎట్టకేలకు మెట్టు దిగారు. సోమవారం నుంచి మొదలవుతున్న 2025-26 వార్షిక బడ్జెట్ సమావేశాలకు తన ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరు కానున్నారు. తొలిరోజు సభలో జరిగే గవర్నర్ ప్రసంగానికి వీరంతా హాజరవ్వనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి 11 సీట్లు లభించిన విషయం తెలిసిందే. దానివల్ల ప్రతిపక్ష హోదాను జగన్ కోల్పోయారు. అయినా, విపక్ష హోదా కోసం ఇన్నాళ్లుగా ఆయన వాదిస్తూనే ఉన్నారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడి, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచీ జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లడంలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో తాను వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వంపై సంధించే ప్రశ్నలకు .. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలని ఇటీవల జగన్ హూంకరించారు. ఈ క్రమంలో అసెంబ్లీ నిబంధనల ప్రకారం వరుసగా అరవై రోజులు ఏ కారణం లేకుండా, సమాచారం ఇవ్వకుండా నిరవధికంగా సభకు గైర్హాజరు అయితే సభ్యుల సభ్యత్వం రద్దవుతుందని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అధికారికంగానే స్పష్టం చేశారు. శాసనసభకు హాజరుకాకపోతే .. సభ్యత్వం రద్దయితే .. ఉప ఎన్నికలను ఎదుర్కోనాల్సి వస్తుందని జగన్ భావించారోఏమోగానీ… అనూహ్యంగా వెనక్కి తగ్గారు.
Also Read : IND vs PAK : నేడు నువ్వా నేనా అన్న రీతిలో తలపడనున్న భారత్ పాక్ జట్లు