Minister Komatireddy :ఎస్ఎల్‌బీసీ లాంటి ప్రమాదాలు జరిగినపుడు కలిసికట్టుగా పని చేయాలి
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ....
Minister Komatireddy : శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు చిక్కుకోవడంతో.. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్(NDRF), ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు, హైడ్రా, ఇండియన్ ఆర్మీ, స్పెషల్ బెటాలియన్ల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy) ఎస్ఎల్‌బీసీ ప్రమాద స్థలి దోమలపెంటకు బయలుదేరి వెళ్లారు. సహాయక చర్యలు పర్యవేక్షించనున్నారు.
Minister Komatireddy Comments
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలకు మానవత్వం లేదని.. ఎస్ఎల్‌బీసీ(SLBC) ప్రమాదాన్ని రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నిరంతరం అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. తూప్రాన్ రైలు ప్రమాదంలో స్కూల్ విద్యార్థులు చనిపోతే కేసీఆర్ కనీసం వెళ్లి పరమర్శించలేదని విమర్శించారు. మీరు చేయని పనులు మేము చేస్తున్నామని.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరం కలిసికట్టుగా ఉండాలన్నారు. ఆపదలో ఉన్నవారికి మనోధైర్యం ఇవ్వాలని, సురక్షితంగా తీసుకురావడానికి సలహాలు ఇవ్వాలన్నారు. ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదని.. అందరినీ బయటకు తెచ్చిన తర్వాత మళ్లీ పనులు మొదలు పెడతామని.. ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ల సంగతి చెబుతామన్నారు.
గతప్రభుత్వం (బీఆర్ఎస్) ఎస్ఎల్‌బీసీని నిర్లక్ష్యం చేసిందని, మేము దాన్ని పూర్తి చేయాలని భావిస్తే ఇలాంటి ప్రమాదం జరగడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అందులో చిక్కుకున్న 8 మంది క్షేమంగా బయటకు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. సొరంగం గురించి, ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదన్నారు. పదేళ్లు సొరంగాన్ని ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలని.. కాళేశ్వరంలో చిన్న చిన్న సొరంగం పనులకు ఎంతో మంది చనిపోయారని, కాళేశ్వరంలో చనిపోతే బీఆర్ఎస్ నేతలు ఏమైనా రెస్క్యూలు చేశారా అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.
కాగా ఆదివారం సాయంత్రం వరకు మూడు బృందాలు లోపలికి వెళ్లాయి. అయితే సొరంగంలో దాదాపు 2.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తున బురద పేరుకుపోవడం, నిమిషానికి 3500 లీటర్ల వరకు ఊటనీరు వస్తుండటం, ప్రమాదం జరిగిన తర్వాత పేరుకుపోయిన నీరు నిల్వ ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. దాదాపు 13 కిలోమీటర్ల వరకు విద్యుత్తు సరఫరాను, వైఫైని పునరుద్ధరించగా.. అక్కడి వరకు ఆక్సిజన్ సరఫరా నిర్విరామంగా కొనసాగుతోంది. టన్నెల్ లోపల ఇరుకుగా ఉండటం, దిగువన బురద కారణంగా అడుగు తీసి అడుగు వేయలేని స్థితి ఉండటంతో.. సహాయక చర్యలకు ఎక్కువ బృందాలను తీసుకెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.
టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) నుంచి దాదాపు 400 మీటర్ల వరకు మట్టి కూరుకుపోయిందని సహాయక చర్యల్లో పాల్గొని తిరిగివచ్చిన వారు చెబుతున్నారు. దీంతో లోపల చిక్కుకున్నవారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున బురద పేరుకుపోవడం, వారు ఉన్న వైపునకు గాలి సరఫరా లేకపోవడం, ప్రమాదం జరిగి దాదాపు రెండు రోజులు అవుతుండటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. లోపలికి వెళ్లివచ్చిన వారు కూడా.. సహాయక చర్యలు పూర్తయి, టన్నెల్‌లో చిక్కుకున్నవారి వద్దకు వెళ్లాలంటే కనీసం మూడు రోజుల సమయం పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం మూడో బృందంలో మధ్యాహ్నం ఒంటి గంటకు టన్నెల్ లోపలికి వెళ్లి సాయంత్రం 6.40 గంటలకు బయటకు వచ్చారు. అక్కడ నెలకొన్న పరిస్థితి ప్రకారం ఎన్ని రోజులు పడుతుందో స్పష్టంగా చెప్పలేమన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, చిక్కుకున్న వారిని కాపాడుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : AP Governor Visit : నేడు శ్రీశైలంలో పర్యటించనున్న గవర్నర్ ‘అబ్దుల్ నజీర్’