DY CM Pawan Kalyan : జగన్ ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
ఇప్పుడు అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని చెప్పుకొచ్చారు...
Pawan Kalyan : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు నినాదాలు చేస్తూ.. కాసేపటికి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందిస్తూ.. సభలో వైసీపీ(YCP) వ్యవహారశైలిపై మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడుతూ.. శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. గవర్నర్కు ఆరోగ్యం సరిగా లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యక్రమాల గురించి చెప్పారని తెలిపారు. ఆరోగ్యం బాగాపోయినా గవర్నర్ సభకు వచ్చి ప్రసంగిస్తే వైసీపీ అడ్డుకోవాలనుకోవటం హేయమని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదు ప్రజలు ఇస్తేనే వస్తుందన్నారు.
Pawan Kalyan Shocking Comments
ఇప్పుడు అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని చెప్పుకొచ్చారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వైసీపీకి వచ్చేదన్నారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వైసీపీ గుర్తించాలన్నారు. 11 సీట్లు మాత్రమే ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందని ఎలా ఊహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అని.. అది నిశ్చయం అయిపోయిందని స్పష్టం చేశారు. ఈ 5ఏళ్ళు ప్రతిపక్ష హోదా తమకు రాదని వైసీపీ మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని హితవుపలికారు. హోదా అనేది సీఎం , స్పీకర్ ఇచ్చేది కాదన్నారు. వైసీపీ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. వైసీపీ నేతలు సభకు వస్తే, ఆ పార్టీకి ఉన్న బలం బట్టి ఎంత సమయం కేటాయించాలో కేటాయిస్తారని తెలిపారు.
‘‘డిప్యూటీ సీఎంగా నేనేమీ బ్రేక్ చేయడం లేదు. ఉదయం గవర్నర్ను ఆహ్వానించే సమయంలో నన్ను పిలిచినా ప్రోటోకాల్ కాదని నేను సున్నితంగా తిరస్కరించా. ఓట్లు శాతం గురించి మాట్లాడే వైసీపీ నాయకులు జర్మనీకి వెళ్లిపోవచ్చు. మన దేశ నిబంధనల మేరకు వారికి ప్రతిపక్ష హోదా సాధ్యం కాదు ’’ అని స్పష్టం చేశారు. సనాతన ధర్మం కోసం తమిళనాడు ప్రభుత్వం కూడా పోరాడుతోందన్నారు. వక్స్ బోర్డు ఉన్నప్పుడు సనాతన ధర్మం బోర్డు ఉంటే తప్పా అని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై మార్చి 14 న మాట్లాడతానని తెలిపారు. రాష్ట్రంలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. తన యూపీ పర్యటనపై వస్తున్న ఆరోపణలపై అంతగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ‘‘వెనక ఉండి మాట్లాడటం కాదు నేరుగా ముందుకు వచ్చి మాట్లాడాలి. నేనేంటో చూపిస్తా . రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అన్నిటికీ సిద్ధపడి రావాలి’’ అని పవన్ పేర్కొన్నారు.
Also Read : SLBC Tunnel Collapse : ముమ్మరంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్