SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ రెస్కూ ఆపరేషన్ కోసం కేరళ జాగిలాలు

ఎస్‌ఎల్‌బీసీ రెస్కూ ఆపరేషన్ కోసం కేరళ జాగిలాలు

 

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మంది జాడను గుర్తించేందుకు సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. ఇందుకోసం కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్లలో రెండు క్యాడవర్ జాగిలాలను తీసుకువచ్చారు. కేరళ ప్రత్యేక పోలీసు బృందం, జిల్లా కలెక్టర్ సంతోష్… విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశం నిర్వహించి… సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ప్రాంతాలపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో సమస్యాత్మకంగా మారిన బురద, మట్టిని తొలగించేందుకు అధికారులు తొలిసారి వాటర్‌ జెట్‌ లను వినియోగిస్తున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని కనుగొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, ర్యాట్‌ హోల్‌ మైన్స్, హైడ్రా తదితర ఏజెన్సీల నిపుణులు బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఫలితం తేలకపోవడంతో తొలిసారిగా వాటర్‌ జెట్‌ లను వినియోగిస్తున్నారు. టన్నెల్‌ బోరింగ్‌ మిషిన్‌(టీబీఎం)పైన, చుట్టుపక్కల పేరుకుపోయిన బురదపై వీటితో నీటిని పంప్‌ చేస్తున్నారు. మరోవైపు సొరంగంలో ప్రమాదకరంగా ఉన్న షీర్‌ జోన్‌ ప్రాంతంలో రోబోల సేవలను వినియోగించే అవకాశాన్ని పరిశీలించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఎన్‌వీ రోబోటిక్స్‌ ప్రతినిధుల బృందం టన్నెల్‌ ను సందర్శించింది. సీఎం రేవంత్‌రెడ్డి టన్నెల్‌ ను సందర్శించిన సమయంలో అవసరమైతే రోబోలను వినియోగిస్తామని ప్రకటించారు. ఈ మేరకు రోబోటిక్స్‌ సంస్థ ప్రతినిధులు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.

13వ రోజు కొనసాగుతున్న రెస్కూ ఆపరేషన్

 

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల వెలికితీత కొసం రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. 13 రోజులుగా మూడు షిప్టుల్లో 24 గంటలూ సహాయక చర్యలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ లభించలేదు. కొన్ని రోజులుగా కష్టపడి పునరుద్ధరించిన కన్వేయర్‌ బెల్టు మళ్లీ తెగిపోయింది. సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్‌ ద్వారానే తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట ఏ మాత్రం తగ్గలేదు. టన్నెల్‌ లో ఉబికి వస్తున్న నీటి ఊటతో డ్రిల్లింగ్‌ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి, ర్యాట్‌ హోల్‌ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ లో పాల్గొంటున్నాయి.

 

జీపీఆర్‌ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. లోకో ట్రైన్‌ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండటంతో మట్టి, రాళ్లతో పాటు కట్‌చేసిన టీబీఎం మెషీన్‌ విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు. టన్నెల్‌లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని రెస్క్యూ బృందాలు వాపోతున్నాయి. గతనెల 22 నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు సొరంగంలో జల్లెడ పడుతున్నా కార్మికుల ఆనవాళ్లు లభించడం లేదు. సొరంగం కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల అవకాశాలను నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ ప్రతినిధుల బృందం పరిశీలించింది.

Leave A Reply

Your Email Id will not be published!