Minister Nara Lokesh: ఏపీలో 2 లక్షల మందికి మైక్రోసాఫ్ట్‌ శిక్షణ

ఏపీలో 2 లక్షల మందికి మైక్రోసాఫ్ట్‌ శిక్షణ

Nara Lokesh : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నైపుణ్యాభివృద్ధిలో రెండు లక్షల మంది యువతకు ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎస్‌డీసీ) ద్వారా మైక్రోసాఫ్ట్‌ సంస్థ శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రి లోకేశ్‌ సమక్షంలో మైక్రోసాఫ్ట్‌, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థల మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. వృత్తి విద్య, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు, యువతలో ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించి… రాష్ట్రంలో ఐటీ ఆధారిత, ఇతర పరిశ్రమలకు అవసరమైన సిబ్బందిని తయారు చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా లోకేశ్‌(Nara Lokesh) మాట్లాడుతూ… అంతర్జాతీయంగా ఏఐ, అధునాతన టెక్నాలజీల్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగావకాశాలను దక్కించుకునేలా మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇస్తుందన్నారు.

Nara Lokesh Comment

రాష్ట్రంలో 50శాతం గ్రామీణ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 500 మంది అధ్యాపకులు, పది వేల మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 30 ఐటీఐల్లో 30 వేలమంది విదార్థులకు డిజిటల్‌ ప్రొడక్టివిటీలో ఏఐ శిక్షణను అందిస్తారని తెలిపారు. రాష్ట్రంలో యూనిసెఫ్‌ భాగస్వామ్యంతో పాస్‌పోర్టు టు ఎర్నింగ్‌ 2.0 ను ప్రవేశ పెట్టేందుకు వీలుగా 40,000 మందికి, కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ సహకారంతో మరో 20,000 మందికి ఏఐ నైపుణ్యాలలో శిక్షణను ఇస్తారని లోకేశ్‌ వెల్లడించారు. ప్రభుత్వ పౌరసేవలను మెరుగుపరచడంతో సహా ప్రభుత్వాధికారుల్లో సామర్థ్యాలను పెంచేందుకు 50,000 మందికి 100 గంటల సేపు మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇస్తుందని లోకేశ్‌ చెప్పారు. ఇందుకోసం ఏపీఎస్ ఎస్ డీసీతో సివిల్‌ సర్వీసెస్‌ కెపాసిటీ బిల్డింగ్‌ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తారన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్ ఎస్ డీసీ ఎండీ గణేశ్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దినేశ్‌కుమార్‌, మైక్రోసాఫ్ట్‌ సౌత్‌ హెడ్‌ ఫర్‌ గవర్నమెంట్‌ బిజినెస్‌ దినేశ్‌ కనకమేడల, మైక్రోసాఫ్ట్‌ ఇండియా సౌత్‌ ఏసియా డైరెక్టర్‌ సందీప్‌ బంద్వేద్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read : APL Cards: ఏపీఎల్‌ కుటుంబాలకు త్వరలో గ్రీన్‌ రేషన్‌ కార్డులు

Leave A Reply

Your Email Id will not be published!