Tej Pratap Yadav: కానిస్టేబుల్ ను బెదిరించి డ్యాన్స్ చేయించిన తేజ్‌ప్రతాప్ యాదవ్
కానిస్టేబుల్ ను బెదిరించి డ్యాన్స్ చేయించిన తేజ్‌ప్రతాప్ యాదవ్
Tej Pratap Yadav : హోలీ వేడుకల్లో ఆర్జేడీ నేత, మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్… విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ ను బెదిరించడం ఇప్పుడు బీహార్(Bihar) రాజకీయాల్లో సంచలనంగా మారింది. మాజీ సీఎంలు లాలు ప్రసాద్, రబ్డీదేవీల పెద్ద కుమారుడు ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav) అధికార నివాసం వద్ద శుక్రవారం నిర్వహించిన హోలీ సెలబ్రేషన్స్ లో తన సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్ ను డాన్స్ చేయమని తేజ్‌ప్రతాప్ హుకుం జారీ చేసారు. ఆ వీడియోలో తేజ్ ప్రతాప్ స్టేజ్‌పై మైకు పట్టుకుని, కింద ఉన్న వారికి ఆదేశాలిస్తున్నారు. ఒక దశలో ఆ కానిస్టేబుల్ ను డ్యాన్స్ చేస్తావా లేకా నిన్ను సస్పెన్షన్ చేయించమంటావా అంటూ అతడ్ని తేజ్‌ప్రతాప్ బెదిరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Tej Pratap Yadav Warning to..
తండ్రి లాలు మాదిరిగానే హోలీ వేడుక సమయంలో పండగ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మద్దతు దారుల చొక్కాలను తేజ్ ప్రతాప్(Tej Pratap Yadav) చించివేశారు. అనంతరం స్కూటర్‌పై ‘పిల్లిమొగ్గల చిన్నాన్నకు హోలీ శుభాకాంక్షలు’అని పరోక్షంగా సీఎం నితీశ్‌కుమార్‌ను ఉద్దేశించి తన నివాసం చుట్టుపక్కల వీధుల్లో కేకలు వేస్తూ తిరిగారు. అదేవిధంగా, తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వేదికపై సోఫాలో కూర్చుని… ‘ఏయ్ పోలీస్.. దీపక్..ఇప్పుడు మేమొక పాట వేస్తాం. డ్యాన్స్ చేయాలి. లేదంటే నువ్వు సస్పెండ్ అవుతావ్. ఏమనుకోకు, ఇది హోలీ పండగ(Holi Celebrations)’ అని అక్కడే ఉన్న దీపక్ అనే కానిస్టేబుల్‌నుద్దేశించి అంటున్న వీడియో వైరల్‌గా మారింది.
దీనితో తేజస్వి యాదవ్ చర్యపై జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ మండిపడ్డారు. ఇవాళ బీహార్‌లో అలాంటి చర్యలకు తావులేదన్నారు. ”ఆటవిక రాజ్యం (జంగిల్ రాజ్) ముగిసింది. కానీ లాలూ పెద్ద కుమారుడి ప్రవర్తన చూడండి. పోలీసును డాన్స్ చేయమని, లేకుండా చర్య తీసుకుంటానని ఆయన ఆదేశిస్తున్నాడు. లాలూ కుటుంబం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బీహార్ మారింది, ఇలాంటి చర్యలకు ఎంతమాత్రం చోటులేదు” అని రంజన్ అన్నారు.
ఇది ట్రయిలర్ మాత్రమే: బీజేపీ
ఆర్జేడీ అధికారంలోనికి వస్తే ఏ విధంగా చట్టరహిత పాలన సాగిస్తుందో, అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. ”తండ్రి లాగానే కొడుకు. ఇంతకు ముందు లాలూ ప్రసాద్ చట్టాన్ని గుప్పిట్లో పెట్టుకుని బీహార్‌ను జంగిల్ రాజ్‌గా మార్చారు. ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా ఆయన కుమారుడు పోలీసులను డాన్స్ చేయమని ఒత్తిడి తేవడం, బెదిరించడం చేస్తున్నారు” అని మండిపడ్డారు. ఇది కేవలం ట్రయిలర్ మాత్రమేనని, ఒకవేళ ఆర్జేడీ అధికారంలోకి వస్తే చట్టాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని చట్టాన్ని అమలు చేసే అధికారులను కీలుబొమ్మలుగా మారుస్తుందని, అందుకే వారిని అధికారానికి దూరంగా ఉంచాలని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగాల్సి ఉన్నాయి.
రాజస్థాన్‌లో రాళ్లతో హోలీ
రాజస్థాన్‌లోని ఆదివాసీ జిల్లా దుంగార్‌పూర్‌లో భీలూడా గ్రామం రాళ్ల హోలీకి ప్రసిద్ధి. అయితే ఈ ఏడాది శుక్రవారం జరిగిన హోలీలో 42 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలోని రఘునాథ్ జీ ఆలయం వద్ద అందరూ గుమికూడి వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. దైవదర్శనం తర్వాత సమీప మైదానంలోకి వెళ్లి రెండు వర్గాలుగా విడిపోయి… పరస్పరం రాళ్లు రువ్వుకొంటూ హోలీ (పత్థర్‌మార్ హోలీ) చేసుకున్నారు. కొందరు వడిశలతోనూ రాళ్లు రువ్వారు. మళ్లీ అందరూ ఒకటై పరస్పరం సహాయం చేసుకొంటూ రక్తమోడుతున్న గ్రామస్థులను భీలూడా ఆస్పత్రికి తరలించారు. గత 20 ఏళ్లుగా తాను ఈ హోలీ చూస్తున్నట్టు గ్రామంలోని ఆరోగ్య కార్యకర్త తెలిపారు. ఈ హోలీతో గ్రామస్థుల రక్తం భూమిపై పడితే ఏడాదంతా గ్రామం సుభిక్షంగా ఉంటుందని స్థానికుల నమ్మకం.
Also Read : Amit Shah: అస్సాంలో మోదీ వల్ల శాంతి, కాంగ్రెస్ వల్ల అశాంతి – అమిత్‌షా