NIMS: నిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో అగ్ని ప్రమాదం
నిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో అగ్ని ప్రమాదం
NIMS : హైదరాబాద్ మహానగరంలోని పంజాగుట్ట నిమ్స్(NIMS) ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ బ్లాక్ లో 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో ఆస్పత్రి ఆవరణ అంతా దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఐదవ అంతస్తులో ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఉన్నాయని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని చెబుతున్నారు. కాగా, 5వ అంతస్తులో ఉన్న పేషెంట్లను ఇతర వార్డులకు తరలిస్తున్నారు ఆస్పత్రి సిబ్బంది.
NIMS Hospital Fire Accident
నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై డైరెక్టర్ డా. బీరప్ప స్పందించారు. ‘‘సాయంత్రం 4.30 సమయంలో ఐదో అంతస్తు ఆడిటోరియంలో షార్ట్ సర్క్యూట్ తో చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా నాలుగో అంతస్తులో మేమే కావాలని విద్యుత్ సరఫరా నిలిపేశాం. ఈ ఫ్లోర్ లోని రోగులను వేరే వార్డుకు షిఫ్ట్ చేస్తున్నాం. అగ్ని ప్రమాదం జరిగిన చోట రోగులు ఎవరూ లేరు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని తెలిపారు.
Also Read : Harish Rao: కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు