PM Narendra Modi: పహల్గాం ఉగ్రదాడితో పాక్ కు ‘పంచ్’ ఇచ్చిన భారత్
పహల్గాం ఉగ్రదాడితో పాక్ కు ‘పంచ్’ ఇచ్చిన భారత్
PM Narendra Modi : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం(Pahalgam) వద్ద పర్యాటకులపై మంగళవారం ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ హస్తం స్పష్టంగా కనిపిస్తోందంటూ మండిపడింది. ఈ నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలకు తీసుకోవడానికి నిర్ణయించింది. దీనిలో భాగంగా పాకిస్తాన్ పౌరులకు భారత్ లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక పాక్ తో దౌత్య సంబంధాలకు చాలావరకు కత్తెర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) సారథ్యంలో సమా వేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ చర్యలతోనే సరిపెట్టకుండా ఉగ్ర ముష్కరులకు, వారిని ప్రేరేపిస్తున్న పొరుగు దేశానికి దీటుగా బదులిచ్చేందుకు కూడా కేంద్రం సమాయత్తమవుతోంది. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై సీసీఎస్ భేటీలో రెండున్నర గంటలకు పైగా లోతుగా చర్చ జరిగింది.
PM Narendra Modi – పాక్ పై భారత్ తీసుకునే చర్యలివే
సార్క్ వీసా మినహాయింపు పథకం (ఎస్‌వీఈఎస్) కింద పాక్ జాతీయులకు భారత వీసాల జారీ నిలిపివేత. ఇప్పటికే జారీ చేసిన వీసాల రద్దు. వాటిపై ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్తానీలు 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశం.
ఉగ్రవాదానికి పాక్ మద్దతివ్వడం మానుకునేదాకా 1960లో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్.
భారత్, పాక్ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజాబ్‌లోని అటారీ సరిహద్దు తక్షణం మూసివేత. దానిగుండా పాక్‌కు వెళ్లినవారు తిరిగొచ్చేందుకు మే 1 దాకా గడువు.
ఢిల్లీలోని పాక్(Pakistan) హై కమిషన్ నుంచి రక్షణ, త్రివిధ దళాల సలహాదారు, వారి ఐదుగురు సహాయక సిబ్బంది బహిష్కరణ. వారంలోపు భారత్ వీడాలని ఆదేశం. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ నుంచి భారత రక్షణ, త్రివిధ దళాల సలహాదారుల ఉపసంహరణ.
ఇరుదేశాల హై కమిషన్లలో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు.
పాక్ గగనతలంలోకి వెళ్లకుండా భారత్ చేరుకున్న ప్రధాని మోదీ
సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని ప్రధాని మోదీ(PM Narendra Modi) ఢిల్లీ వస్తోన్న సమయంలో ఆయన ప్రయాణిస్తోన్న విమానం పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ లో ఉన్న దృశ్యాల ద్వారా ఈ విషయం తెలిసింది. సౌదీ అరేబియాకు వెళ్లే సమయంలో ప్రధాని మోదీ ప్రయాణించిన ఎయిర్‌ఫోర్స్ బోయింగ్ 777-300 విమానం పాకిస్థాన్ గగనతలం మీదుగానే రియాద్ చేరుకుంది. అయితే, దాడి నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తిరుగు ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించారు. ప్రధాని విమానం అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ గగనతలంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుంది.
శిక్షించి తీరతాం – విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ
పహల్గాం దాడిని సీసీఎస్ అత్యంత తీవ్రంగా ఖండించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. దాడికి తెగబడ్డ ముష్కరులతో పాటు దాని సూత్రధారులను కూడా కఠినంగా శిక్షించి తీరాలని సీసీఎస్ తీర్మానించింది’’ అని వెల్లడించారు. ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ రాణా మాదిరిగానే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టడం ప్రకటించారు.
‘‘జమ్మూ కశ్మీర్లో విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ ప్రాంతమంతా ఆర్థికాభివృద్ధితో కళకళలాడుతున్న వేళ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రపూరిత దాడి ఇది. దాని వెనక దాగున్న సీమాంతర లింకులపై సీసీఎస్ లోతుగా చర్చించింది. ప్రపంచ దేశాలన్నీ దాన్ని అత్యంత తీవ్ర పదజాలంతో ఖండించిన తీరును ప్రశంసించింది. ఉగ్రవాదంపై రాజీలేని పోరులో భారత్‌కు ఆ దేశాల మద్దతుకు ఇది ప్రతీక అని పేర్కొంది. పాక్‌పై తీసుకున్న చర్యల జాబితాను చదివి వినిపించారు.
Also Read : Tourists: ఖాళీ అవుతోన్న కాశ్మీరం ! ఉగ్రదాడి ఘటనతో కాశ్మీర్ ను వీడుతున్న పర్యాటకులు !