Pahalgam Terror Attack : పహల్గాం దాడులతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదుల ఇల్లు దగ్ధం

అయితే, పేలుడుకు కారణమైన పదార్థం గురించి కచ్చితమైన వివరాలు తెలియరాలేదు...

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని బందీపొరా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పులు ఎన్‌కౌంటర్ కు దారి తీశాయి. కుల్నార్ బాజిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ సమయంలోనే ఆ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలను చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైనికులు అంతే ధీటుగా ప్రతీకార చర్యకు దిగారు. ఇరువర్గాల నడుమ పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

Pahalgam Terror Attack Updates

మరో వైపు జమ్మూ కాశ్మీర్‌(Jammu Kashmir) పుల్వామా జిల్లాలోని ట్రాల్‌లోనూ భద్రతా దళాలు తృటిలో తప్పించుకున్నారు. మోంఘమా ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తుండగా సమీపంలో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. రక్షణాత్మక ప్రదేశాలకు చేరుకునేసరికే ఒక ఇంట్లో నుంచి భారీ పేలుడు సంభవించింది. ఆ ఇల్లు లష్కరే తోయిబా (LeT) స్థానిక కమాండర్ గా ఉన్న ఆసిఫ్ షేక్ అనే ఉగ్రవాదిదని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో(Pahalgam) మారణకాండ సృష్టించిన ఉగ్రవాదుల్లో ఆసిఫ్ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులోనూ పోలీసులు అతడి పేరును చేర్చారు. అయితే, పేలుడుకు కారణమైన పదార్థం గురించి కచ్చితమైన వివరాలు తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

బిజ్‌బెహారాలోని అదిల్ థోకర్ అలియాస్ అదిల్ గురి అనే మరో ఎల్‌ఈటి ఉగ్రవాది ఇంటిని భారత సైనికులు పేల్చివేశారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడిలో థోకర్ కూడా కీలక పాత్ర పోషించాడు. బిజ్‌బెహారా నివాసి అయిన ఆదిల్ థోకర్ 2018 లో చట్టబద్ధంగా పాకిస్తాన్‌కు వెళ్లాడు. అక్కడ అతడు ఉగ్రవాద శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. గతేడాది తిరిగి స్వగ్రామానికి వచ్చి దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. చాాలాకాలం నుంచి నిఘా సంస్థల రాడార్‌లో ఉన్నాడని అధికారులు చెబుతున్నారు.

Also Read : Tirumala: పహల్గాం దాడితో తిరుమలలో హై అలర్ట్ ! ఆక్టోపస్ బృందాలతో మాక్ డ్రిల్ !

Leave A Reply

Your Email Id will not be published!