Bilawal Bhutto – Indus Treaty : పాక్ ‘పీపీపీ’ పార్టీ నేత బిలావల్ భుట్టో పిచ్చి కూతలు
సింధు నాగరికత పరిరక్షకులం తామే అంటూ భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు...
Bilawal Bhutto : పహల్గాం దాడి వెనుకున్న పాక్‌కు ఝలకిచ్చేందుకు భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం దయాది దేశానికి గట్టి షాకే ఇచ్చింది. రాబోయే ముప్పును తలుచుకుని పాక్ రాజకీయ నేతలు మొదలు సామాన్యుల వరకూ వణికిపోతున్నారు. చిక్కులు తప్పవని చింతిస్తున్నారు. భారత్ చర్యలు పాక్‌కు భారీ షాకిచ్చాయనేందుకు సూచనగా అక్కడి పీపీపీ పార్టీ నేత బిలావాట్ భుట్టో జర్దారీ(Bilawal Bhutto) సంచలన వ్యాఖ్యలు చేశాడు. సింధు నదీలో నీరు ప్రవహించకపోతే పాక్ ప్రత్యర్థుల రక్తం పారుతుందంటూ బిలావాల్ నోరు పారేసుకున్నారు. సింధు నాగరికత పరిరక్షకులం తామే అంటూ భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు.
Bilawal Bhutto Sensational Comments on Indus Water Treaty
సింధు నది మాదే. ఎప్పటికీ మాదే. నదిలో నీరైనా పారుతుంది లేదా వారి రక్తమైనా పారుతుంది. పాకిస్థాన్ గానీ అంతర్జాతీయ సమాజం కానీ ఈ యుద్ధ కాంక్షను అస్సలు సహించదు. వేల ఏళ్ల నాటి సింధు నాగరికతకు తాము వారసులమని మోదీ అంటుంటారు. కానీ ఈ సంస్కృతికి పరిరక్షకులము మేమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాము’’ అంటూ ఓ ర్యాలీలో మండిపడ్డారు. భారత్‌తో ఉద్రిక్తతలు మరింత ముదిరేలా బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారు. అంతకుమునుపు, పాక్ రక్షణ శాఖ మంత్రి కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ బీహార్‌లో చేసిన ప్రసంగం తరువాత పాక్ నేతలు తమ నోటికి పనిచెప్పడం మొదలెట్టారు.
ఉగ్రవాదులను ప్రపంచం అంచులవరకూ వెంటాడి అంతమొందిస్తామని ప్రధాని మోదీ(PM Modi) బీహార్‌లో ప్రసంగించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇచ్చే వారిని వదిలిపెట్టేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్, పాక్‌ల మధ్య సింధు నదుల జాలాల పంపిణీ కోసం 1960లో ఈ ఒప్పందం కుదిరింది. సింధు నదుల పరీవాహక ప్రాంతంలోని 6 నదుల పంపకంపై ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం తూర్పున ఉన్న బియాస్, రావీ, సట్లజ్ నదుల్లోని నీళ్లపై హక్కులు భారత్‌కు, సింధు నది, ఛెనాబ్, ఝెలమ్ నదుల నీళ్లు పాక్‌కు దక్కాయి. అయితే, పహల్గాం దాడి తరువాత పాక్ తగిన గుణపాఠం చెప్పాలన్న సంకల్పంతో ఉన్న భారత్ ఈ ఒప్పందం అమలును నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో సింధు నదినీటిని భారత్ దిగువన ఉన్న పాక్‌కు విడుదల చేయకపోతే దాయాది దేశానికి షాక్ తప్పదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : CSK – MS Dhoni : సీఎస్కే బ్యాటర్లపై కెప్టెన్ మాహి ఘరం