Minister Bandi Sanjay: మావోయిస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
మావోయిస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చత్తీస్ ఘడ్, తెలంగాణా సరిహాద్దుల్లోని కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర భద్రతా బలగాలు, చత్తీస్ ఘడ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ కగార్ ను… పలువురు పౌర హక్కుల సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టుల ఎన్ కౌంటర్ ను వెంటనే నిలిపివేసి… శాంతి చర్చలు జరపాలని సూచిస్తారు. దీనికి తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కూడా మద్దత్తు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులను ఉద్దేశ్యించి కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేసారు.
కరీంనగర్ లోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… ‘‘తుపాకీతో అమాయకులను చంపేవారితో చర్చలు ఉండవు. మావోయిస్టులతో ఇక మాటల్లేవ్… మాట్లాడుకోడాల్లేవ్. వారిపై నిషేధం విధించింది కాంగ్రెస్సే. మావోయిస్టులు… పలు పార్టీల నేతలను మందుపాతరలు పెట్టి చంపారు. ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. ఎన్నో గిరిజనుల కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారు. తుపాకీ వదిలిపెట్టేవరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదు. పాస్పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. రోహింగ్యాలపై తన వైఖరి ఏమిటో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి’’ అని బండి సంజయ్ అన్నారు.
కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకం. ఇది కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరం. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణను పొంతనే ఉండదు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. బీసీల జనాభాను తగ్గించి చూపారు. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదు. ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోంది. పాస్ పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా… కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను తెలంగాణ, ఛత్తీస్ఘడ్ మధ్యలో ఉన్న కర్రెగుట్టల్లో వరుస ఎన్కౌంటర్లు నిర్వహిస్తోంది. అయితే ఈ చర్యలను సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం శాంతి సామరస్య పూర్వకంగా చర్చలు జరపాలని రేవంత్రెడ్డి, కేసీఆర్ కోరారు. ఈ మేరకు శాంతికమిటీతో సీఎం రేవంత్రెడ్డి చర్చలు జరిపారు. అలాగే మాజీ మంత్రి జానారెడ్డితో సమావేశం అయి శాంతి చర్చల గురించి చర్చించారు. కేంద్ర కాంగ్రెస్ నేతలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.