Pawan Kalyan: అశృనయనాల మధ్య మురళీ నాయక్ కు అంత్యక్రియలు
అశృనయనాల మధ్య మురళీ నాయక్ కు అంత్యక్రియలు
Pawan Kalyan : పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను మురళీనాయక్ అంత్యక్రియలు అశృనయనాల మధ్య అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ స్వయంగా జవాను మురళీ నాయక్ పాడె మోసారు. అంత్యక్రియల్లో మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, అనిత, సవిత, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, స్థానికులు పాల్గొని నివాళి అర్పించారు. అనంతరం ఆర్మీ, పోలీసుల అధికారిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్య క్రియలు నిర్వహించారు. అంతకు ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)… శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి జవాను మురళీ నాయక్ పార్ధివ దేహానికి నివాళి అర్పించారు. అనంతరం మురళీ నాయక్ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు.
ఈ సందర్భంగా మురళీ నాయక్(Murali Nayak) కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు. వారికి రాష్ట్రప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి ఐదెకరాలతో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు. అంతేకాదు వీరజవాను కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మురళీనాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.
Pawan Kalyan – మంగళవారం కళ్ళితండాకు వైఎస్ జగన్
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్… పాకిస్తాన్(Pakistan) జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. దీనితో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం అంటే మే 13వ తేదీన కళ్లి తండాకు వెళ్లనున్నారు. ఇప్పటికే వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. దీనిలో భాగంగా 13వ తేదీన కళ్లి తండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్.
భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను మురళీ నాయక్ వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్… నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్ తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాకిస్తాన్ దుశ్చర్యలను అడ్డుకునే క్రమంలో ఆ జవాన్ వీర మరణం పొందగా, ఆదివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. శనివారం బెంగళూరు నుంచి కళ్లి తండాకు వీర జవాన్ మురళీ నాయక్ పార్ధివదేహాన్ని తరలించగా, ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.
Also Read : AP Government: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ! మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గా రాయపాటి శైలజ !