Giri Pradakshina: సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల‌పై స‌మీక్షించిన జిల్లా క‌లెక్ట‌ర్

సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల‌పై స‌మీక్షించిన జిల్లా క‌లెక్ట‌ర్

Giri Pradakshina : ఈ నెల 09, 10వ తేదీల్లో నిర్వహించబోయే శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి సింహాచలం గిరి ప్రదక్షిణ (Giri Pradakshina) కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌యంతో విజ‌య‌వంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేర‌కు జిల్లాకు చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారుల‌తో శుక్ర‌వారం స్థానిక క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో గిరి ప్రదక్షిణ (Giri Pradakshina) ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. ఈ స‌మావేశంలో ఎంపీ శ్రీ‌భ‌ర‌త్, ఎమ్మెల్యేలు వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు, విష్ణుకుమార్ రాజు, పంచ‌క‌ర్ల ర‌మేశ్ బాబు, వంశీకృష్ణ శ్రీ‌నివాస్, వీఎంఆర్డీఏ ఛైర్మ‌న్ ప్ర‌ణవ్ గోపాల్, డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు, ఏపీ ఆయిల్స్ అండ్ సీడ్స్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ గండి బాబ్జీ ఇత‌ర ప్రతినిధులు పాల్గొన్నారు.

Simhachalam Giri Pradakshina

ఈ సందర్భంగా ముందుగా జిల్లా యంత్రాంగం త‌ర‌ఫున చేసిన ఏర్పాట్లను ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు వివ‌రించారు. ఈ నెల 09వ తేదీ తెల్లవారు ఝాము నుంచి 10 సాయంత్రం వరకు కొండదిగువ తొలిపావంచా వద్ద భక్తులను, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పోలీస్ బందోబస్తు, పోలీస్ శిబిరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేశామ‌ని, క్యూలైన్లు, రద్దీ ప్రదేశాల‌ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, తోపులాటలు లేకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే రెండు సార్లు ఏర్పాట్ల‌పై స‌మీక్షించామ‌ని చెప్పారు.

5-6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్ర‌తి 200 మీట‌ర్ల‌కు ఒక‌టి చొప్పున మొత్తం 132 తాగునీటి పాయింట్లు, 500 మరుగు దొడ్లు, ఆరు కంట్రోల్ రూమ్లు, 5 చోట్ల ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్ట్ం, 32 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 18 నెట్ వ‌ర్కింగ్ ఆసుప‌త్రుల‌కు వాటిని అనుసంధానం చేస్తున్నామ‌ని, 18 అంబులెన్సుల‌ను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ప్ర‌తి టాయిలెట్ వ‌ద్ద పారిశుధ్ధ్య కార్మికుడు, సూప‌ర్ వైజర్ ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. రద్దీ ప్రదేశాల్లో ప్రాథ‌మికంగా 190 ఎల్.ఈ.డి. లైట్లు వేస్తున్నామ‌ని, అప్ఫూఘ‌ర్ వ‌ద్ద 5 బోట్ల‌ను, 60 మంది గ‌జ ఈత‌గాళ్ల‌ను ఉంచుతున్నామ‌ని చెప్పారు. నిరంతరాయంగా విద్యుత్ స‌రఫ‌రా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, 9 జనరేటర్లను సిద్ధం చేసుకున్నామ‌ని వెల్ల‌డించారు. ముందు జాగ్రత్త చర్యగా 09, 10వ తేదీల్లో మద్యం షాపులను మూయించేస్తున్నామ‌ని చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం 50 ఉచిత‌ బస్సు స‌ర్వీసుల‌ను న‌డుపుతున్నామ‌ని పేర్కొన్నారు. స్వామివారి కొండపై అగ్నిమాపక యంత్రం, ఫైర్ నియంత్రిక ప‌రిక‌రాల‌తో పాటు అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామ‌ని వివ‌రించారు.

రహదారిలో ఉండే పాఠశాలలు, కళ్యాణ మండపాల్లో మొత్తం 14 చోట్ల విశ్రాంతి ప్రాంతాల‌ను గుర్తించామ‌ని చెప్పారు. చెట్ల కొమ్మ‌ల‌ను తొల‌గించి, విద్యుత్ తీగ‌లు వేలాడ‌కుండా చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని, ఈ మేర‌కు అన్ని విభాగాల అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశామ‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు. టాయిలెట్ల‌కు నీరు స‌ర‌ఫ‌రా చేసేందుకు గాను 50 ట్యాంకుల‌ను సిద్ధం చేశామ‌న్నారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో సహాయం కొర‌కు యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామ‌ని చెప్పారు. అడ‌వివ‌రం నుంచి ఫైనాపిల్ కాల‌నీ వర‌కు ఉండే ప్రాంత‌వాసుల సౌక‌ర్యార్థం గిరి ప్ర‌ద‌క్షిణ (Giri Pradakshina) రోజు మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల వ‌ర‌కు తొలిపావంచాకు చేరుకునేందుకు వీలుగా ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతామ‌ని పేర్కొన్నారు. 13 ప్రాంతాల్లో పార్కింగు స‌దుపాయం క‌ల్పిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

Also Read : Visakhapatnam Police: విశాఖలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

Leave A Reply

Your Email Id will not be published!