AP Govt Schools Meeting : ఈరోజు ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్-టీచర్ మీటింగ్

అనంతరం ముఖ్యమంత్రి స్థానికంగా పాల్గొని తల్లిదండ్రులతో ముఖాముఖి సంభాషించనున్నారు...

AP Govt : ఆంధ్రప్రదేశ్‌లో నేడు పేరెంట్-టీచర్‌ మెగా మీటింగ్‌ 2.0 ఆవిష్కృతం కానుంది. సుమారు 2 కోట్ల 28 లక్షల మంది పాల్గొననున్న ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, అనుబంధ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటిలోనూ ఈ సమావేశాన్ని ఉత్సవంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

AP Govt Schools Parent-Teacher Meeting

సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌లో ముఖ్య కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu), విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి స్థానికంగా పాల్గొని తల్లిదండ్రులతో ముఖాముఖి సంభాషించనున్నారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీలు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు వంటి పలువురు భాగస్వాములు ఉన్నారు. విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడమే ఈ మీటింగ్ లక్ష్యం. పిల్లల విద్యాభివృద్ధి, ప్రవర్తన, సామాజిక చైతన్యం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

ఈవెంట్‌లో తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు అందజేయడం, పాఠశాలల పనితీరుపై వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. కార్పొరేట్ పాఠశాలల్లో తరచూ జరిగే పేరెంట్-టీచర్ మీటింగ్ పద్ధతిని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అమలు చేయాలన్నది కూటమి ప్రభుత్వ సంకల్పం. గత ఏడాది డిసెంబర్ 7న నిర్వహించిన మెగా పీటీఎం 1.0కు మంచి స్పందన రావడంతో ఈ ఏడాది రెండో ప్రయత్నం చేపట్టారు.

పుట్టపర్తి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 9:30 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకుని, కొత్తచెరువు జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో ముఖాముఖి సంభాషిస్తారు. అనంతరం జడ్పీ హైస్కూల్‌లో పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొంటారు. అక్కడి నుంచి ప్రసాంత నిలయంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు.

సీఎం పర్యటన నేపథ్యంలో 1500 మంది పోలీసులతో పుట్టపర్తిలో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

ఈ మెగా కార్యక్రమం ద్వారా విద్యావ్యవస్థలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.

Also Read : AP and Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో వర్షాల హడావుడి: వాతావరణ శాఖ హెచ్చరికలు

Leave A Reply

Your Email Id will not be published!