Minister Bandi Sanjay : టీటీడీ అన్యమత ఉద్యోగులపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
ఆలయ అర్చకులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు...
Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబంతో కలిసి కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.
Union Minister Bandi Sanjay Comments on TTD
దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ (Bandi Sanjay) , టీటీడీలో అన్యమత ఉద్యోగుల ఉనికి అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘టీటీడీలో వెయ్యికిపైగా అన్యమతస్థులు పని చేస్తున్నారు. వీరికి హిందూ సనాతన ధర్మంపై విశ్వాసం లేదు. వారి ద్వారా హిందూ ఆచారాలు, సంప్రదాయాలు దెబ్బతింటున్నాయి,’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అన్యమత ఉద్యోగుల తొలగింపుపై డిమాండ్:
టీటీడీ పాలకమండలి తక్షణమే స్పందించి, అన్ని శాఖల్లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను గుర్తించి తొలగించాలన్నారు. ఇటీవల ఓ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఘటనను ప్రస్తావించిన ఆయన, ‘‘ఒకరిని సస్పెండ్ చేయడం సరిపోదు. మొత్తం అన్యమత స్థులపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు.
పురాతన దేవాలయాల అభివృద్ధిపై సూచనలు:
తెలుగు రాష్ట్రాల్లోని పలు పూర్వకాల దేవాలయాలు సరైన ఆదరణ లేక మూతపడే స్థితిలో ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లేందు రామాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం, వేములవాడ రాజరాజేశ్వర ఆలయాల అభివృద్ధికి టీటీడీ ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ధూప దీప నైవేద్యాలు అందని చిన్న ఆలయాలను కూడా టీటీడీ అభివృద్ధి చేయాలని సూచించారు.
ఇందుకు సంబంధించి త్వరలో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో చర్చలు జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
భక్తుల క్షేమమే లక్ష్యం:
శ్రీవారి సేవలో నిజమైన భక్తి, నిబద్ధతతో పనిచేసే వారికే అవకాశం కల్పించాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తిరుమల దేవస్థానం హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందనీ, అక్కడ పనిచేసేవారంతా అదే మనసుతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : Lashkar Bonalu : 13,14న జరగబోయే ‘లష్కర్ బోనాలకు’ అంగరంగ వైభవంగా ఆలయాలు
