Dharmavaram: ఉగ్రవాద సంస్థలతో లింకులున్న ధర్మవరం వారి అరెస్ట్
ఉగ్రవాద సంస్థలతో లింకులున్న ధర్మవరం వారి అరెస్ట్
Dharmavaram : పాకిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థలతో ఫోన్ లో చాటింగ్ చేస్తున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం యువకుడు నూర్ మహ్మద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్ఐఏ, కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి కీలక సమాచారం అందడంతో అప్రమత్తమైన ధర్మవరం (Dharmavaram) పోలీసులు గత కొద్ది రోజులుగా అతనిపై నిఘాపెట్టారు. నిన్న రాత్రి నూర్ మహమ్మద్ ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. తెల్లవారుజామున డీఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో పోలీసుల బృందం నిందితుడి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. అతను ధర్మవరం (Dharmavaram) మార్కెట్ సమీపంలోని సల్మాన్ బిర్యానీ సెంటర్లో పనిచేస్తున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయడంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Dharmavaram People Arrest
నూర్… పాకిస్థాన్ (Pakistan) ఉగ్రవాద సంస్థల ప్రభావానికి లోనైనట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు పాక్‌లోని ఉగ్రసంస్థలతో నిత్యం వాట్సాప్ చాటింగ్ చేస్తూ… సుమారు 30 ఉగ్రవాద సంస్థల్లో సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించారు. నిందితుడి ఇంట్లో కొన్ని సిమ్ కార్డులు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పుస్తకాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు. సిమ్ కార్డులు ఎక్కడ కొనుగోలు చేశాడు? ఎలా వినియోగిస్తున్నాడు? ఒక్కో సిమ్ కార్డుతో ఎన్ని వాట్సాప్ గ్రూప్‌ల్లో సభ్యుడిగా ఉన్నాడు? ఏయే విషయాలపై చాటింగ్ చేశాడన్న విషయాలను పరిశీలిస్తున్నారు. ఫోన్ కాల్స్‌కు సంబంధించిన సమాచారం కోసం ఆయా సిమ్ నెట్ వర్క్ సంస్థల నుంచి సేకరించేందుకు అధికారికంగా మెయిల్స్ పెడుతున్నారు. సింధూర్ ఘటన తరువాత పాకిస్థాన్‌లోని తీవ్రవాద సంస్థలతో నూర్ మహమ్మద్ ఎక్కువ సార్లు మాట్లాడినట్టు సమాచారం.
నిందితుడు నూర్ మహమ్మద్‌ను పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. నిందితుడి కుటుంబంలో తగాదాల కారణంగా భార్య.. నూర్ మహమ్మద్‌ను వదిలి వేరుగా ఉంటున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే తాడిపత్రిలో ఓ మహిళతో ఇతనికి వివాహేతర సంబంధం ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు.. ఆమె గురించి మధ్యాహ్నం వరకు విచారించారు. పాకిస్థాన్ తీవ్రవాద సంస్థలతో ఆ మహిళకు కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా?అన్న కోణంలో ప్రశ్నించారు.
మార్కెట్ సమీపంలోని సల్మా బిర్యానీ హోటల్ చుట్టపక్కల కూడా నిందితుడికి సంబంధించిన కొంత సమాచారాన్ని పోలీసులు సేకరించారు. నిందితుడు నూర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, సాయంత్రం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కదిరిలో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. నూర్ మహమ్మద్‌ను విచారిస్తుండగానే ధర్మవరం ఎర్రగుంట కాలనీకి చెందిన రియాజ్ అనే ఆటో డ్రైవర్ భారతదేశానికి వ్యతిరేకంగా, పాక్‌కు అనుకూలంగా వాట్సాప్ డీపీ పెట్టుకున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. రియాజ్‌ను కుడా అదుపులోకి తీసుకొని డీఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు. అయితే, నూర్ మహమ్మద్‌కు, రియాజ్‌కు సంబంధాలున్నట్లు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదనేది సమాచారం.
Also Read : CM Chandrababu : రజనీకాంత్ 50 ఏళ్ళ సినీ ప్రయాణంపై చంద్రబాబు, పవన్ రియాక్షన్స్
