Telangana Ministers: వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి – తెలంగాణా మంత్రులు

వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి - తెలంగాణా మంత్రులు

Telangana : ఇటీవల తెలంగాణలో సంభవించిన వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి… తక్షణమే నిధులు విడుదల చేయాలని… రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. వరద సాయం కింద తెలంగాణకు తక్షణమే రూ. 5,018 కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు (Amit Shah) వినతి పత్రం సమర్పించారు. అంతేకాదు వరద నష్టాన్ని అంచనా వేయడానికి వెంటనే కేంద్ర బృందాలను తెలంగాణకు పంపాలన్నారు.

Telangana Ministers Demand

ఆగస్టు 25–28 మధ్య తెలంగాణ (Telangana) రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి భారీ విధ్వంసం సృష్టించాయి. ఈ జిల్లాల్లో మౌలిక సదుపాయాలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25 శాతం అధికంగా ఉంది. ఎనిమిది జిల్లాల్లో 65 నుంచి 95 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. వర్షాలు కొనసాగుతూనే ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు, పంటలు, పశువులు, మానవ ప్రాణాలు నష్టపోయాయి’ అని మంత్రులు అమిత్ షాకు (Amit Shah) వివరించారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వనరులను సమీకరించి సహాయ చర్యలు చేపడుతుందని మంత్రులు పేర్కొన్నారు. 7 ఎన్డీఆర్ఎఫ్, 15 ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, సుమారు 100 మంది సైనిక సిబ్బంది సహాయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని తెలిపారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణతో ప్రాణనష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించామని మంత్రులు స్పష్టం చేశారు. అయితే, కురిసిన వర్షాల తీవ్రతతో రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, కల్వర్టులు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ జీవన విధానానికి అంతరాయం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్ర హోం మంత్రిని కోరారు.

‘తెలంగాణలో (Telangana) వరదల వల్ల రూ. 5, 018 కోట్ల రూపాయల నష్టం జరిగిందనేది అంచనాగా ఉంది. ఈ నిధులను తక్షణమే విడుదల చేయండి. 2024కు సంబంధించి 11713 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. మొత్తం కలిపి 16,732 కోట్ల రూపాయలు విడుదల చేయండి. ఆగస్టు 25 28 తేదీలో తెలంగాణలో (Telangana) భారీ వర్షాల వల్ల మెదక్ నిజామాబాద్ నిర్మల్ ప్రాంతాలలో తీవ్ర నష్టం జరిగింది. కామారెడ్డిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది వరదలలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు , అనేక పశువులు చనిపోయాయి. అనేక ఇల్లు వర్షాలతో దెబ్బతిన్నాయి. వరదలకు రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. దెబ్బతిన్న రోడ్లు విద్యుత్ స్తంభాలు పునరుద్ధరించేందుకు పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయాలి’ అని తెలంగాణ మంత్రులు విజ్ఞప్తి చేశారు.

మౌలిక సదుపాయాల నష్టాలు ప్రాథమిక అంచనాల ప్రకారం

1. రోడ్లు (ఆర్&బీ) – రూ.785.59 కోట్లు

2. ఇంధన శాఖ (విద్యుత్) – రూ.40.73 కోట్లు.

3. పంట నష్టం – రూ.236 కోట్లు

4. నీటిపారుదల – రూ.655.70 కోట్లు

5. పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి – రూ.377.43 కోట్లు

6. వైద్య & ఆరోగ్య శాఖ – రూ.14.84 కోట్లు

7. పశుసంవర్ధక శాఖ – రూ.10 కోట్లు

8. మున్సిపల్ పరిపాలన – రూ.1025 కోట్లు

9. అత్యవసర మరమ్మతులకు తక్షణ నిధుల అవసరం – రూ.1500 కోట్లు

10. ఇతర శాఖలు / ప్రభుత్వ ఆస్తులు – రూ.300 కోట్లు

11. గృహనిర్మాణ శాఖ – రూ.25 కోట్లు

12. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం – రూ.23.43 కోట్లు.

మొత్తం ప్రాథమిక అంచనాలు: రూ.5018.72 కోట్లు

ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే అని మంత్రులు పేర్కొన్నారు. వరదలు నష్టంపై పూర్తి గణన పూర్తయితే నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మంత్రులు తెలిపారు. గత ఏడాది ఖమ్మం, పరిసర జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రూ.11,713 కోట్ల సహాయం కోరినా.. ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని వారు గుర్తు చేశారు. కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయని, దాంతో పునర్నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని వివరించారు. అందువల్ల గతంలో కోరిన రూ.11,713 కోట్లతో పాటు తాజా అంచనా రూ.5,018 కోట్లు, మొత్తం రూ.16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని అమిత్ షాకు వినతి పత్రం అందజేసినట్లు స్పష్టం చేశారు.

ఈ విజ్ఞప్తికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సానుకూలంగా స్పందించారని మంత్రులు తెలిపారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందాన్ని తెలంగాణకు (Telangana) పంపి నష్టాలను అంచనా వేయిస్తామని హామీ ఇచ్చారని మంత్రులు తెలిపారు. ఈ సమావేశంలో విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(రెవెన్యూ) అర్వింద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డా.గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.

పామాయిల్‌పై సుంకాల తగ్గింపుతో రైతులకు తీవ్ర నష్టం – భట్టి విక్రమార్క

రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులు, రుణాలు తదితర అంశాలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు కలిసి వివరించారు. పామాయిల్‌పై తగ్గించిన సుంకాల వల్ల రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించినట్టు మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న విద్యాసంస్థలకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చినట్టు పేర్కొన్నారు. సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలవబోతున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం అంచనాలను కేంద్ర హోం మంత్రికి వివరించనున్నట్టు చెప్పారు.

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీలతో కలిసి ఆయన అభ్యాస్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో తన హైదరాబాద్ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నట్లు సమాచారం. అసలు అయితే సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఉత్సవం జరగనుంది. ఈ ఉత్సవంలో హోం మంత్రి అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అందులో భాగంగా ముందుగా షెడ్యుల్ కూడా ఖరారు అయింది. కానీ ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పార్టీ ఎంపీలతో కలిసి ఆయన అభ్యాస్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. దీంతో తన హైదరాబాద్ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.

Also Read : CM Revanth Reddy: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ పర్యటన

Leave A Reply

Your Email Id will not be published!