Women Fight : దేశంలోని మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన పోరాటం కొనసాగించారు రైతులు. దేశ చరిత్రలో ఇది ఓ రికార్డ్ గా పరిగణించక తప్పదు. రైతులతో పాటు మహిళలు, మహిళా రైతులు కూడా పాల్గొన్నారు.
దాడులకు పాల్పడినా, కేసులు నమోదు చేసినా అదర లేదు. బెదర లేదు. ఈ శతాబ్ధంలో జరిగిన అతి పెద్ద రైతు ఉద్యమంలో పాల్గొన్న వీరి ధీరత్వాన్ని చూసి, పోరాట పటిమను చూసి యావత్ ప్రపంచం విస్తు పోయింది.
వారి అలుపెరుగని పట్టుదలకు ఆశ్చర్య పోయింది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన టైమ్ మ్యాగజైన్ (Women Fight )ఏకంగా తన కవర్ పై భారత దేశానికి చెందిన మహిళా రైతుల ఫోటోను ప్రచురించింది.
ఇందులో ప్రత్యేక కథనం వెలువరించింది. ఇది ప్రపంచాన్ని ప్రభావితం చేసేలా చేసింది. మహిళలు తాము సైతం ఈ పోరాటంలో కీలక భూమిక పోషించారు. సాక్షాత్తు భారత సర్వోన్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుని విరమించమని కోరినా పట్టించు కోలేదు.
తమ వారితో కలిసి పిల్లా పాపలతో రైతు ఉద్యమంలో భాగం పంచుకున్నారు. రైతు పోరాటం ప్రారంభం నుంచి ముగింపు పలికేంత దాకా వారితో పాటే ఉన్నారు. వారితో కలిసి నడిచారు.
వర్షం కురిసినా, ఎండలు మండుతున్నా గూడారాలు వేసుకుని అక్కడే వంటలు చేసుకుని ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలిచారు.
వంద రోజులు పూర్తయ్యాక టైమ్ మ్యాగజైన్ వీరి ఫోటోను ప్రచురించింది.
ఈ చట్టాలు మమ్మల్ని చంపేందుకు మాత్రమే నిర్దేశించబడ్డాయంటూ ఆరోపించారు. పురుషులు మాత్రమే కాదు మహిళలమైన మేము సైతం వ్యవసాయ రంగంలో కీలకంగా వ్యవహరించామని నినదించారు.
మొత్తంగా రైతులు సాధించిన విజయంలో మహిళలు కూడా ఉండడం విశేషం కదూ.
Also Read : భర్త యుద్దం భార్య సహకారం