Bhagwant Mann : ప్రజలను ప్రేమించే నాయకులు ఎక్కడో ఉండరు. వారి మధ్యనే ఉంటూ తమదైన ప్రత్యేక శైలిని కలిగి ఉంటారు. వారు సమస్యలను సానుకూల దృక్ఫథంతో ఆలోచిస్తారు.
అందుకేనేమో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పుడు కమెడియన్ గా, నటుడిగా ,
ఎంపీగా ఉన్న భగవంత్ మాన్ ను ఏరికోరి సీఎంగా ఎంపిక చేశాడు. ఆయనతో పాటు పంజాబ్ లోని అత్యధిక జనం మాన్ కావాలంటూ మొగ్గు చూపారు.
దీనిని తేలికగా తీసుకున్న వారు, ఆయా పార్టీలన్నీ తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డాయి. ప్రజాస్వామ్యం ఎంత విలువైన సాధనమో,
దాని ద్వారా ఓటు హక్కు అనేది ఎంత గొప్పదో భారత రాజ్యాంగ స్పూర్తి ప్రదాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పకనే చెప్పాడు.
మొత్తం 117 సీట్లలో 92 సీట్లను గెలుచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ చరిత్ర సృష్టించింది.
ఇదంతా ఓ వేవ్ మాత్రమేనని పెదవి విరిచిన వాళ్లకు భగవంత్ మాన్ (Bhagwant Mann)తానేమిటో చేసి చూపించాడు.
ఆయనకు కమెడియన్ గా మరో పేరు కూడా ఉంది. అదే జగ్నూ.
తన పంజాబీ యాసతో నవ్వించిన ఈ నటుడు ప్రస్తుతం ప్రజలు ఇచ్చిన అరుదైన ఛాన్స్ తో సీఎంగా కొలువు తీరనున్నాడు.
తాను పోటీ చేసిన ధురి నియోజకవర్గం లో గెలుపొందిన తర్వాత కీలక ప్రసంగం చేశాడు. ఇక ఆఫీసుల్లో సీఎం ఫోటో ఉండదని ప్రకటించాడు.
అంతేనా తాను ఎక్కువగా ప్రేమించే, నమ్మే ఉరి కొయ్యలను ముద్దాడిన షహీద్ భగత్ సింగ్ పుట్టిన ఊరు ఖట్కర్ కలాన్ లో ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించాడు.
ఇది ఓ సంచలనాత్మక నిర్ణయం అని చెప్పక తప్పదు. ఇక నెలలోనే మీరు కోరుకున్న మార్పు ఏమిటో చూస్తారని చెప్పాడు. ఆపై తమ పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశాడు.
రాజధానిలో కాదు నియోజకవర్గాలలో ఉండాలని సూచించాడు. ప్రజల సమస్యలు ఏమిటో వినండి. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలన్నాడు. అంతేనా 122 మంది మాజీ ఎమ్మెల్యేలకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు భగవంత్ మాన్ .
వారికి ఉన్న సెక్యూరిటీని తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. ఎమ్మెల్యేలైనా సరే వినయంగా ఉండాలన్నాడు. ఓట్లు వేసిన వారే కాదు ఓటు వేయని వారు కూడా మన ప్రజలేనని ప్రకటించాడు పాజీ.
మున్ముందు జన రంజకమైన పాలన అందించాలని కోరుకుందాం.
Also Read : సీట్లతో పాటు ఓట్లు కోల్పోయిన కాంగ్రెస్