Delhi Rains : ఢిల్లీలో కుండపోత వర్షం ట్రాఫిక్ జామ్
తడిసిన జనం..వాహనాలకు ఆటంకం
Delhi Rains : రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో భారీగా వర్షాలు(Delhi Rains) కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కుండ పోత వర్షం రావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి పోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఢిల్లీలోని కైలాష్ తూర్పు, బురారీ, షాహదారా, పట్పర్ గంజ్ , ఐటీఓ క్రాసింగ్, ఇండియా గేట్ , తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి.
నగరంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కు పెరిగిన వేడి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో చల్ల బడింది. నిన్నటి దాకా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడిన నగర వాసులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు.
బారాపుల్లా, రింగ్ రోడ్ , ఢిల్లీ నోయిడా సరిహద్దు, ఢిల్లీ గుర్గావ్ రోడ్లపై భారీగా వరద నీరు పారుతోంది. ఉదయం వేళ వివిధ పనుల నిమిత్తం, కార్యాలయాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు.
ట్రాఫిక్ జాం ఏర్పడడంతో వాహనదారులు మధ్యలోనే ఇరుక్కు పోయారు. ఇదిలా ఉండగా భారీ వర్షం కారణంగా ఢిల్లీ వెళ్లాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు.
ఎయిర్ ఇండియా విమానాన్ని అమృత్ సర్ కు మళ్లించగా ఇండిగో విమానాన్ని జైపూర్ కు మళ్లించారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ప్రగతి మైదాన్, వినోద్ నగర్ సమీపంలోని ఢిల్లీ మీరట్ ఎక్స్ ప్రెస్ వే, పుల్ ప్రహ్లాద్ పూర్ అండర్ పాస్ , ఐపీ ఎస్టేట్, జహంగీర్ పురి మెట్రో స్టేషన్ తదితర ప్రాంతాలలో నీళ్లు నిలిచి పోయాయి.
వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని , అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Also Read : ఉదయ్ పూర్ లో ఉద్రిక్తత భారీ నిరసన