Air India Black Box: విదేశాలకు ఎయిరిండియా ‘బ్లాక్‌ బాక్స్‌’ పంపించడంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

విదేశాలకు ఎయిరిండియా ‘బ్లాక్‌ బాక్స్‌’ పంపించడంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Air India Black Box : అహ్మదాబాద్‌ లో ఎయిరిండియా (Air India) విమానం కుప్పకూలి 241 మంది సహా 270 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు 215 మంది మృతదేహాలను గుర్తించగా… వాటిలో 198 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని వైద్యాధికారులు వెల్లడించారు. దీనితో విమాన ప్రమాదానికి గల కారణాలను గుర్తించడంలో కీలకమైన ‘బ్లాక్‌ బాక్స్‌’ విశ్లేషణపై అందరి దృష్టి పడింది. దీని కోసం ‘బ్లాక్‌ బాక్స్‌’ను విదేశాలకు తరలిస్తారంటూ వస్తున్న పుకార్లను కేంద్రం తోసిపుచ్చింది. ఈ మేరకు బ్లాక్ బాక్స్ తరలింపుపై కేంద్రం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.

Air India Black Box Clarification

‘‘బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానంలో ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (డీఎఫ్‌డీఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌)లతో కూడిన బ్లాక్‌ బాక్స్‌లు రెండు ఉంటాయి. జూన్‌ 13న ఒకదాన్ని, జూన్‌ 16 మరోదాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఎక్కడ డీకోడ్‌ చేయాలనేది ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (AAIB)’ నిర్ణయిస్తుంది. సేఫ్టీ, సెక్యూరిటీ, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఘటనపై ఏఏఐబీ నిపుణుల బృందం దర్యాప్తు ప్రారంభించింది. స్థానిక యంత్రాంగం, సంస్థల సహకారంతో ఇది క్రమంగా కొనసాగుతోంది. సైట్ డాక్యుమెంటేషన్, ఆధారాల సేకరణ సహా కీలకమైన రికవరీ పనులు పూర్తయ్యాయి’’ అని పౌరవిమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ నెల 12న లండన్‌ వెళ్లేందుకు అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఓ వైద్య కళాశాల వసతిగృహంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది సహా మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు అప్పగించిన మృతదేహాల జాబితాలో 149 మంది భారతీయులు, 32 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్‌ జాతీయులు, ఒక కెనడియన్‌ తోపాటు నేలపై ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు ఉన్నారు. ఇదే ఘటనలో గాయపడిన ఎనిమిది నెలల చిన్నారి ధ్యాయాంశ్‌ కి 28 శాతం కాలిన గాయాలు కాగా, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు అతడి తండ్రి తెలిపారు. మరోవైపు.. కోపైలట్‌ క్లైవ్‌ కుందర్‌ మృతదేహానికి ముంబయిలో అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read : Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలకు అంతర్జాతీయ గుర్తింపు

Leave A Reply

Your Email Id will not be published!