Akash Anand: బిఎస్పీ అధినేత్రి మాయావతికి మేనల్లుడు ఆకాశ్ బహిరంగ క్షమాపణ
బిఎస్పీ అధినేత్రి మాయావతికి మేనల్లుడు ఆకాశ్ బహిరంగ క్షమాపణ
Akash Anand : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను పార్టీ నుండి బహిష్కరించి నెల రోజుల క్రితం గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలో చాలా సార్లు పార్టీ నుండి బయటకు వచ్చి… తిరిగి వెళ్ళిన సంగతి కూడా చాలా పరిపాటిగా మారింది. అయితే ఈ సారి మాత్రం అటువంటి అవకాశం లేదని… పార్టీకు సంబంధించిన అన్ని బాధ్యతల నుండి ఆకాశ్ కు పూర్తిగా సంబంధాలు తెలిపోయాయని తేల్చి చెప్పింది. అయితే తాజాగా తన మేనత్త మాయావతిని ఉద్దేశ్యించి… ఆకాశ్ తన అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అత్త మాయావతికి బహిరంగ క్షమాపణలు చెప్తూ ఆకాశ్(Akash Anand) పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Akash Anand Open Apology
తాజాగా ఆకాశ్ ఆనంద్(Akash Anand) తనను తిరిగి పార్టీలోకి తీసుకోవాలంటూ అత్త మాయావతిని వేడుకుంటున్నాడు. తనను క్షమించాలని, ఇక నుంచి బాధించే పనులు ఏమీ చేయనని కాళ్ల బేరానికి వచ్చారు. ‘నేను చేసిన అన్ని తప్పులను క్షమించి తిరిగి నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి. పార్టీలోకి నన్ను తీసుకోండి. నేను పార్టీకి, మా అత్త మాయావతికి రుణపడి ఉంటాను. ఇక తిరిగి ఎప్పుడూ ఎటువంటి తప్పిదాలు చేయను.పార్టీకి నష్టం చేసే పనులు అస్సలు చేయను’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు ఆకాశ్ ఆనంద్. తాను ఇక నుంచి మాయవతి చెప్పినట్లే నడుచుకుంటానని, ఎవర్నుంచి ఏ విధమైన తప్పుడు సలహాలు తీసుకోనని పేర్కొన్నాడు. బీఎస్పీలో ఉన్న సీనియర్ల నుంచి ఏమైనా మంచి విషయాలు ఉంటే నేర్చుకుంటానని స్పష్టం చేశాడు.
గత నెలలో బహుజన్ సమాజ్ పార్టీ(BSP) అధినేత్రి మాయవతి… తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను పార్టీ జాతీయ సమన్వయకర్తతో పాటు అన్నీ పదవుల నుంచి తొలగించారు. గతేడాది కూడా ఆకాష్ ఆనంద్ పై వేటు పడింది. ఆ తర్వాత తిరిగి నియమించారు. ఈ క్రమంలోమరోసారి బాధ్యతల నుంచి పార్టీ పదవుల నుంచి తొలగించారు మాయావతి. ఆకాష్ స్థానంలో ఆయన తండ్రి ఆనంద్ కుమార్, సీనియర్ నాయకుడు రామ్‌జీ గౌతమ్‌లను జాతీయ సమన్వయకర్తలుగా నియమించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆకాష్ ఆనంద్ రాజకీయ అరంగేట్రం చేశారు. సోషల్ మీడియా ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2023 చివర్లో పార్టీ జాతీయ సమన్వయకర్తతో నియమితులయ్యారు. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు మాయావతి అతనిని పార్టీలోని పదవుల నుంచి తొలగించగా, మరొకసారి బహిష్కరణకు గురయ్యాడు ఆకాశ్ ఆనంద్. ఇలా పార్టీ నుంచి బహిష్కరణకు గురి కావడం, మళ్లీ తిరిగి పార్టీలోకి రావడం ఆకాశ్ ఆనంద్ కు అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో అతను పెట్టిన పోస్ట్ ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Also Read : Delhi Police: ఢిల్లీలో పసిబిడ్డల విక్రయ ముఠా అరెస్టు