Alamgir Alam: పని మనిషి ఇంట్లో రూ. 25 కోట్లు లభ్యం !

పని మనిషి ఇంట్లో రూ. 25 కోట్లు లభ్యం !

Alamgir Alam: సార్వత్రిక ఎన్నికల వేళ రాంచీలో గుట్టలుగుట్టలుగా డబ్బులు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మనీలాండరింగ్ కేసులో భాగంగా సోమవారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో 15 వేల రూపాయల జీతానికి కాంగ్రెస్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి వద్ద పనిచేసే పనిమనిషి ఇంటి నుండి రూ. 25 కోట్లను స్వాధీనం చేసుకొన్నారు. సదరు వ్యక్తికి రాష్ట్ర మంత్రి అలంఘీర్‌ ఆలం(Alamgir Alam) ప్రభుత్వ కార్యదర్శి సంజీవ్‌ లాల్‌ వద్ద పనిచేస్తున్నట్లు తేలింది. దీనితో ఈ డబ్బు ఆ మంత్రికి చెందిన డబ్బుగా అనుమానిస్తుండటంతో ఇప్పుడు మంత్రి అలంఘీర్‌ ఎవరు అనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఝార్ఖండ్ రాష్ట్ర మంత్రి అలంఘీర్ వద్ద సంజీవ్ లాల్ కార్యదర్శిగా గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. సంజీవ్ లాల్ గతంలో దాదాపు పది మంది మంత్రులకు పీఏగా పనిచేసారు. అయితే సంజీవ్ లాల్ వద్ద హౌస్ కీపర్ గా పనిచేస్తున్న జహంగీర్‌ అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో జహంగీర్ ఇంట్లో గుట్టలుగుట్టలుగా డబ్బు కట్లను గుర్తించారు. ఈ నేపథ్యంలో డబ్బు కట్టలను లెక్కించడానికి బ్యాంకుల నుండి కౌంటింగ్ మిషన్లను తెప్పించి లెక్కించారు. మొత్తం రూ. 25 కోట్లు నగదుతో పాటు బంగారం కూడా స్వాదీనం చేసుకున్నారు. అయితే జహంగీర్ జీతం నెలకు కేవలం రూ. 15 వేలు మాత్రమే. దీనితో అతడి ఇంట్లో కోట్ల కొద్ది నగదు గుట్టలు బయటపడటంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

దీనితో పనిమనిషి ఇంట్లో రూ. 25 కోట్లు లభ్యం కావడంతో మంత్రి అలంఘీర్(Alamgir Alam) దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. 1954లో పుట్టిన అలంఘీర్‌ రాష్ట్రంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు. పకూర్‌ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సాహెబ్‌ గంజ్‌ జిల్లాలో నివాసం ఉండే అలంఘీర్‌ 2006లో రాష్ట్ర స్పీకర్‌గా కూడా పనిచేశారు. 2009లో ఓటమి పాలైన అతడు 2014, 2019లో విజయం సాధించారు. ప్రస్తుతం చంపాయ్‌ సోరెన్‌ మంత్రివర్గంలో గ్రామీణ మంత్రిత్వశాఖను నిర్వహిస్తున్నారు. 2023లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాచీ చీఫ్‌ ఇంజినీర్‌ వీరేంద్ర కుమార్‌ రామ్‌ పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు నిర్వహించింది. ఈ కేసు తర్వాత అలంఘీర్‌ కూడా ఈడీ రాడార్‌లోకి వచ్చారు. వీరేంద్ర కుమార్‌ కాంట్రాక్టర్ల వద్ద కమిషన్‌ పేరిట భారీగా దండుకొన్నట్లు తెలిసింది. వీరికి టెండర్లను ఆశ చూపి ఈ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. హేమంత్‌ సోరెన్‌ జైలుకు వెళ్లిన తర్వాత ఏర్పడిన చంపాయ్‌ సర్కారులో అలంఘీర్‌ను ఉపముఖ్యమంత్రిని చేయాలనే చర్చ బలంగా నడవడం ఆయన పలుకుబడిని తెలియజేస్తుంది. ఇక ఆయన ప్రమాణ స్వీకారం కూడా ముఖ్యమంత్రితోపాటే జరగడం విశేషం.

Alamgir Alam – పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలపై స్పందించిన ప్రధాని మోదీ

ఝార్ఖండ్ మంత్రి అలంఘీర్‌ ఆలం సహాయకుడు సంజీవ్‌ లాల్‌ ఇంట్లో పనిచేసే వ్యక్తి వద్ద భారీ మొత్తంలో డబ్బు దొరకడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ఝార్ఖండ్‌ లో ఈ రోజు నోట్ల కట్టలు బయటపడ్డాయి. అతడు దొంగతనం చేశాడని… ఆ డబ్బు మోదీ తీసుకెళ్లిపోయాడని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు చెప్పండి.. నేను వారి దోపిడీని ఆపితే… వారు నన్ను తిడతారు కదా?మరి నేను ఆ పని చేయాలా? వద్దా?’’ అని ఒడిశా ఎన్నికల ప్రచార సభలో మోదీ తన మద్దతుదారుల్ని ప్రశ్నించారు.

Also Read : SRH vs MI : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

Leave A Reply

Your Email Id will not be published!