Presidential Election : ఎన్నిక ముగిసింది ఫలితమే మిగిలింది
ద్రౌపది ముర్ము వర్సెస్ యశ్వంత్ సిన్హా నువ్వా నేనా
Presidential Election : దేశంలో అత్యున్నత పదవిగా భావించే రాష్ట్రపతి ఎన్నిక ఎట్టకేలకు(Presidential Election) ప్రశాంతంగా ముగిసింది. దేశంలోని పార్లమెంట్ తో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో కూడా ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికకు సంబంధించి ఈనెల 21న ఫలితం రానుంది. భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో ఉండగా విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు.
ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని సాక్షాత్తు పోటీ చేసిన అభ్యర్థి సిన్హా ఆరోపించడం కలకలం రేపింది. కేంద్రంలోని మోదీ సర్కార్ కుట్రలు, కుయుక్తులతో పాటు అధికారాన్ని ఉపయోగించిందంటూ నిప్పులు చెరిగారు.
నిన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు స్పష్టమైన మెజారిటీ లభించినట్లు సమాచారం. దీంతో ఆమె ఎన్నిక ఇక లాంఛన ప్రాయంగా మిగలనుంది. అయితే క్రాస్ ఓటింగ్ కూడా చోటు చేసుకున్నట్లు పెద్ద ఎత్తున విపక్షాలు ఆరోపించాయి.
కొందరిపై కేంద్రం కక్షగట్టిందని మండిపడ్డాయి. అనేక పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించాయి. పార్లమెంట్ లో మొత్తం 736 ఓటర్లు ఉండగా వీరిలో 728 మందికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం దక్కింది.
అనారోగ్యం ఉన్నప్పటికీ భారత దేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎనిమిది మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. వీరిలో బీజేపీ , శివసేన పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీలు, కాంగ్రెస్, శివసేన, సమాజ్ వాది పార్టీ, బీఎస్పీ, ఎంఐఎం పార్టీల నుంచి ఒక్కొరొక్కరు గైర్హాజరయ్యారు. ఎలాంటి విప్ ఉండదు కాబట్టి వారి ఆత్మానుసారం ఓటు వేయాల్సి ఉంటుంది.
Also Read : బ్యాంకు కస్టమర్లకు సీబీడీటీ బిగ్ షాక్