దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ అప్పుడే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. వ్యూహాలు రచిస్తోంది. ట్రబుల్ షూటర్ అమిత్ షా చాప కింద నీరులా అల్లుకు పోతున్నారు. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. నిత్యం వార్తల్లో ఉండేలా చూస్తున్నారు. ఇది బీజేపీ స్ట్రాటజీ. ఇక దేశమంతటా ఆక్టోపస్ కంటే వేగంగా విస్తరించిన కాషాయాన్ని అడ్డుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పటి వరకు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉందని అనుకున్నా ఆ పార్టీ ఆశించిన మేర ప్రజలకు భరోసాను ఇవ్వలేక పోయిందన్న విమర్శలు లేక పోలేదు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆ పార్టీకి, దాని అనుబంధ మిత్రపక్షాలకు ఒక టానిక్ గా మారుతాయని భావించారు. కానీ దేశానికి ఒక స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. పదే పదే ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తూ వస్తున్నా రాహుల్ గాంధీ చివరకు వేటుకు గురయ్యారు. రెండేళ్ల శిక్ష పడడంతో ఆ పార్టీలో కొంత నిస్తేజం అలుముకుంది. రాజస్థాన్ , ఛత్తీస్ గఢ్ తప్పితే ఏ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ చేతిలో లేదు. ప్రతి చోటా ప్రాంతీయ పార్టీలు బలంగా మారాయి.
మతం పేరుతో ఓటు బ్యాంకు కొల్లగొడుతూ వస్తున్న బీజేపీని ఢీకొని పవర్ లోకి రావాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. నిన్నటి దాకా శరద్ పవార్ ట్రై చేశాడు. వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కొంత మేరకు ప్రయత్నం చేస్తున్నాడు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి తాము ముందుకు వెళతామని ప్రకటించారు. ఇదే విషయాన్ని స్పష్టం చేసింది మాజీ చీఫ్ సోనియా గాంధీ.
ఇదే క్రమంలో ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , తెలంగాణ సీఎం కేసీఆర్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముందు నుంచీ ఒకరితో కలిసి పని చేసేందుకు ఒప్పు కోవడం లేదు. తమంతకు తాముగా పోటీలో ఉండాలని భావిస్తున్నారు. ఇటీవల కేసీఆర్ చేసిన ప్రకటన కలకలం రేపింది. తనను యూపీఏ చైర్ పర్సన్ చేస్తే రాబోయే ఎన్నికల్లో ఖర్చునంతా భరిస్తానని చెప్పడం. జేఎంఎం, డీఎంకే , శివసేన యూబీటీ కాంగ్రెస్ తోనే ఉంటామని ప్రకటించాయి. ఎన్సీపీ దోబూచులాడుతోంది.
ఈ తరుణంలో జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ రంగంలోకి దిగారు. ఆయన ప్రతిఒక్కరితో కలుస్తున్నారు. అన్ని పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. దేశంలో బీజేపీని ఎదుర్కోవాలంటే విభేదాలు వీడాలి. ఎవరైనా సరే ఒక్కరే పోటీ చేయాలని ప్రతిపాదించారు. మొత్తంగా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైన ప్రస్తుత పరిస్థితుల్లో కత్తులు కలుస్తాయా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది.