Ambati Rayudu: పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు భేటీ ! ఆశక్తికరంగా ఏపి రాజకీయాలు

పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు భేటీ ! ఆశక్తికరంగా ఏపి రాజకీయాలు

Ambati Rayudu: ప్రముఖ అంతర్జాతీయ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంకు చేరుకున్న అంబటి రాయుడు… పలు అంశాలపై పవన్ కళ్యాణ్ తో సుమారు మూడు గంటల పాటు చర్చించారు. మధ్యాహ్నం భోజనం కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన అంబటి రాయుడు… భేటీ అనంతరం వెండి వినాయుడి ప్రతిమను బహూకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. అయితే కాసేపటి తరువాత వారి సమావేశం యొక్క సారాంశాన్ని తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వివరించారు. అయితే పవన్-రాయుడుల భేటీ ఏపి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు.

Ambati Rayudu – ఎక్స్ ద్వారా సమావేశం వివరాలు వెల్లడించిన అంబటి రాయుడు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటీ వివరాలను ఎక్స్‌ ద్వారా రాయుడు(Ambati Rayudu) వెల్లడించారు. ‘‘స్వచ్ఛమైన మనసు, ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. నా ఆలోచనలు, కలలు సాకారమవుతాయని వైసీపీలో చేరాను. క్షేత్రస్థాయిలో అనేక గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నా. వ్యక్తిగతంగా సాధ్యమైనంత మేరకు సాయం చేసాను. కాని వైసీపీతో కలసి ముందుకెళ్తే.. నేను అనుకున్న లక్ష్యాలను సాధించలేనని నాకు అర్థమైంది. ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుబట్టడం లేదు. నా ఆలోచన, వైసీపీ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. అందుకే కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నాను.

అయితే.. నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి పవన్‌(Pawan Kalyan) అన్నను కలవమని నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నాకు సలహా ఇచ్చారు. ఆయన సిద్ధాంతాల గురించి తెలుసుకోమన్నారు. అందుకే నేను ఈ రోజు పవన్‌ కళ్యాణ్ గారిని కలసి మాట్లాడాను. జీవితం, రాజకీయాలతో పాటు ఆయన్ను అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించాను. మా ఇద్దరి ఆలోచనల్లో సారూప్యత కనిపించింది. ఆయన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌ కోసం త్వరలో నేను దుబాయ్‌ వెళ్తున్నా. నేను ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అండగా ఉంటా’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పవన్-రాయుడు ల భేటీ

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, క్రికెటర్ అంబటి రాయుడుల(Ambati Rayudu) భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలపై ఆశక్తితో ఇటీవల వైసిపిలో చేరిన అంబటి రాయుడు… కొద్ది రోజులకే పార్టీకు రాజీనామా చేసారు. అయితే గుంటూరు ఎంపీ సీటు ఆశించి వైసీపీలో చేరిన అంబటి రాయుడుకి… ఆ సీటులో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను పోటీ చేయమని అధిష్టానం సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి.

అయితే లావు శ్రీకృష్ణ దేవరాయలు గుంటూరు ఎంపీగా పోటీకు అంగీకరించకపోయినప్పటీకీ… తాను ఆశించిన సీటును వేరొకరికి కేటాయించడం పట్ల మనస్తాపానికి గురై అంబటి రాయుడు వైసీపీకు రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దాదాపు 24 గంటల పాటు సోషల్ మీడియాలో జరిగిన రచ్చ తరువాత… దుబాయ్ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ లో పాల్గొనాల్సి ఉండటంతో రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. దీనితో అటు వైసీపీ,ఇటు టిడిపి-జనసేన వర్గాల నుండి వివిధ రకాలుగా ప్రచారాలు జరిగాయి. అయితే అనూహ్యంగా అంబటి రాయుడు బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : MP Sanjeev Kumar: వైసీపీకు కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌ గుడ్‌బై

Leave A Reply

Your Email Id will not be published!