Amit Shah KCR Comment : ట్ర‌బుల్ షూట‌ర్ వ‌ర్సెస్ టార్చ్ బేర‌ర్

అమిత్ షా గెలుస్తాడా కేసీఆర్ నిలుస్తాడా

Amit Shah KCR Comment : దేశంలో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నా కేవ‌లం ఒకే ఒక్క నియోజ‌క‌వ‌ర్గంపై ఎక్కువ‌గా ఫోక‌స్ ఉంది. అది తెలంగాణ‌లోని మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం(Munugodu BYPoll). ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న ఉన్న‌ట్టుండి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఆ వెంట‌నే భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. ఉప ఎన్నిక కూడా వ‌చ్చేసింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం న‌వంబ‌ర్ 3న పోలింగ్ చేప‌ట్ట‌నుంది. ఇదంతా ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం మొత్తం ఈ నియోజ‌క‌వ‌ర్గం పైనే దృష్టి సారిస్తున్నాయి ప్ర‌ధాన పార్టీల‌న్నీ.

ఇక్క‌డ ప్ర‌ధానంగా పోటీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల మ‌ధ్యే ఉండ‌నుంది.

కానీ ఇక్క‌డే అస‌లైన చిక్కు వ‌చ్చి ప‌డింది. త్వ‌ర‌లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప‌ట్ల ఉన్న వ్య‌తిరేకత నుంచి గ‌ట్టెక్కేందుకు పావులు క‌దుపుతున్నారు సీఎం కేసీఆర్.

రాజ‌కీయ నాయ‌కుడిగా పేరొందిన ఆయ‌న ఉద్య‌మ‌కారుడిగా స‌క్సెస్ అయ్యారు. దేశంలో పాపుల‌ర్ లీడ‌ర్ గా పేరొందారు.

ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని అవే త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయ‌ని ఆయ‌న న‌మ్ముతున్నారు. ఇదే స‌మ‌యంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీల‌ను నామ రూపాలు లేకుండా చేయాల‌ని పావులు క‌దుపుతున్నారు.

ఇది ప‌క్క‌న పెడితే ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా మునుగోడు ఉప ఎన్నిక‌ను సీరియ‌స్ గా తీసుకున్నారు.

ఎలాగైనా స‌రే ఎన్ని కోట్లు అయినా స‌రే గెలవాల‌ని , బీజేపీని మ‌రింత విస్త‌రించాల‌ని, తెలంగాణ‌లో కాషాయ జెండా ఎగుర వేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న ప‌దే ప‌దే చెబుతూ వ‌స్తున్నారు.

ఈ త‌రుణంలో అన్ని అస్త్రాల‌ను ప్ర‌యోగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ త‌న ఉమ్మ‌డి శ‌త్రువు బీజేపీ, టీఆర్ఎస్ కాబట్టి ఆపార్టీకి చెందిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ‌న్ మ్యాన్ షో చేస్తున్నారు.

ఇక్క‌డ ప్ర‌ధానంగా కాషాయం వ‌ర్సెస్ గులాబీగా(Amit Shah KCR) మారింది. ఒక ర‌కంగా చెప్పాలంటే బ‌హుజ‌నుల ఓట్లు ఎక్కువ‌గా ఉన్నాయి. అధికార

యంత్రాంగంతో పాటు పాల‌క వ‌ర్గంలోని మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, ఇత‌ర నేత‌లంతా మునుగోడులో మ‌కాం వేశారు. ఏ ఒక్క ఓటు ఇత‌ర పార్టీల‌కు వెళ్ల కూడ‌ద‌ని ఆదేశించారు గులాబీ బాస్.

దీంతో ఇది ఇరు పార్టీల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారింది. మ‌రో వైపు ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ వెంక‌ట్ రెడ్డి సోద‌రుడు బ‌రిలో ఉండ‌డంతో ఎందుకు వ‌చ్చిన ఖ‌ర్మ అనుకుంటూ ఆస్ట్రేలియాకు జంప్ అయ్యారు. ఆపై ఆయ‌న పేరుతో విడుద‌లైన ఆడియో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.

చివ‌ర‌కు ఆయ‌న‌కు షోకాజ్ నోటీసు అందుకునేలా చేసింది. ఇది ప‌క్క‌న పెడితే మూడు పార్టీలు అగ్ర వ‌ర్ణాల‌కు చెందిన వారికే టికెట్లు కేటాయించారు.

మొత్తంగా బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య కాంగ్రెస్ ఎవ‌రి ఓట్ల‌ను చీలుస్తుంద‌నే దానిపై విజ‌యం ఆధార ప‌డి ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక కులాల వారీగా తాయిలాలు అందించే ప‌నిలో ప‌డ్డాయి పార్టీలు. 

ఇక ఇటీవ‌ల హుజూరాబాద్ లో చోటు చేసుకున్న డ‌బ్బులు, మ‌ద్యం, ప్ర‌లోభాల కంటే ఎక్కువ‌గా వంద రెట్లు మునుగోడులో చోటు చేసుకోవడాన్ని ప్ర‌జాస్వామిక వాదులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

ఇదే స‌మ‌యంలో నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషించాల్సిన ఎన్నిక‌ల సంఘం మౌనంగా ఉండ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. మొత్తంగా మునుగోడు దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌క పోవ‌చ్చు. కానీ రాష్ట్రంలో ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్లాన్ చేస్తున్న బీజేపీకి ఒక స‌వాల్ లాంటిది 

కాగా రాబోయే ఎన్నిక‌ల్లో ముచ్చ‌ట‌గా మూడోసారి కొలువు తీరాలంటే దీనిని చేజిక్కించు కోవాల‌ని కాషాయాన్ని ఖ‌తం చేయాల‌ని ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్.

మొత్తం మీద త్రిముఖ పోరు కొన‌సాగుతున్నా అస‌లైన యుద్దం మాత్రం ఇద్ద‌రి మ‌ధ్యే ఉంద‌న్నది వాస్త‌వం. అదెవ‌రో కాదు ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా ..టార్చ్ బేర‌ర్ కేసీఆర్. మ‌రి ఎవ‌రు గెలిపిస్తారో చూడాలంటే వేచి చూడాలి.

Also Read : హీట్ పెంచుతున్న మునుగోడు డెడ్ లైన్

Leave A Reply

Your Email Id will not be published!