Amit Shah : సీఎంలతో సమావేశం అనంతరం మావోయిస్టుల పై షా సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ....
Amit Shah : హింస మార్గంలో ఏం సాధించలేమని.. జన జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హింస మార్గాన్ని వీడే మావోయిస్టుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వాటిని వినియోగించుకుని ప్రజల్లోకి రావాలని మావోయిస్టులకు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా సూచించారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం శాఖ మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023, మార్చి 31వ తేదీ నాటికి దేశంలో నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్స్ అంశాలపై చర్చించారు.
Amit Shah Comments..
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) మాట్లాడుతూ.. మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేయడంతోపాటు పోలీస్ సామర్ధ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర చాలా బాగా పనిచేశాయని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్యంగా పని చేస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే వికసిత భారత్ సాధించాలంటే గిరిజనులు, ఆదివాసీలు సైతం అందులో భాగస్వామ్యం కావాలన్నారు. కానీ ప్రభుత్వ ఫలాలు గిరిజనులు, ఆదివాసీలకు అందకుండా మావోయిస్టులు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) మండిపడ్డారు. రహదారులు, టవర్లు, చివరకు విద్య, వైద్యం సైతం వీరికి చేరనివ్వడం లేదన్నారు. అయితే గత కొన్నేళ్లుగా మావోయిస్టు సమస్యను ఎదుర్కొనే విషయంలో మోదీ సర్కార్ గణనీయమైన పురోగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు. 2022లో తొలి సారి మావోయిస్టు హింస కారణంగా జరిగిన మరణాల సంఖ్య 100 కంటే తక్కువ నమోదయిందని వివరించారు. అలాగే మావోయిస్టుల ప్రభావిత గిరిజన ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ ఫలాలు, పథకాలు సైతం వేగంగా చేరుతున్నాయని తెలిపారు.
మావోయిస్టుల సమస్యను అధిగమించేందుకు బహుముఖ వ్యూహాన్ని సైతం అమలు చేస్తున్నామన్నారు. దీంతో ఈ సమస్యను చాలా సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల పోలీస్ విభాగాలు సైతం చాలా బాగా పని చేస్తున్నాయన్నారు. ఇక ఎన్‌కౌంటర్‌లలో గాయపడిన భద్రత బలగాలను త్వరితగతిన వైద్య చికిత్స అందించేందుకు హెలికాప్టర్ సేవలను వినియోగిస్తున్నామని గుర్తు చేశారు. అయితే ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష తీవ్రవాదంపై పైచేయి సాధించామని హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఈ సందర్భంగా వివరించారు.
ఈ సమీక్షా సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతోపాటు డీజీపీ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే జార్ఖండ్, బిహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
మరోవైపు భవిష్యత్తులో వామపక్ష తీవ్రవాదం దేశానికి ముప్పుగా పరిణమిస్తుందని కేంద్రంలోని మోదీ సర్కార్ భావిస్తుంది. ఆ క్రమంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసేందుక చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో దశాబ్దాల క్రితం నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పశుపతి టూ తిరుపతి కారిడార్ ఏర్పాటు చేసేందుకు మావోయిస్టులు ఉపక్రమించారు. అయితే దీనిని సైతం మోదీ సర్కార్ ధ్వంసం చేసిన విషయాన్ని ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇంకోవైపు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు మావోయిస్టులు వార్షికోత్సవాలు జరపాలంటూ కేడర్‌కు పిలుపు నిచ్చింది. అలాంటి వేళ.. ఛత్తీస్‌గఢ్‌లో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 35 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతకు భద్రత దళాలు ముమ్మర చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు రాష్ట్రాల్లోకి వెళ్లకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకున్నాయి. అందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. ఇక దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిన సంగతి తెలిసిందే.
Also Read : Minister Kiren Rijiju : ముస్లింలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుంది