Anurag Thakur: పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్ ల విషయంలో వైఖరి మారలేదు – అనురాగ్ ఠాకూర్
పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్ ల విషయంలో వైఖరి మారలేదు - అనురాగ్ ఠాకూర్
Anurag Thakur : ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టీమ్ ఇండియా పాకిస్థాన్‌తో తలపడనుండటంపై భారత అభిమానుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై బీజేపీ ఎంపీ, కేంద్ర క్రీడాశాఖ మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) వివరణ ఇచ్చారు. మల్టీనేషనల్ టోర్నమెంట్లలో పాకిస్థాన్‌తో భారత్ తలపడాల్సి వచ్చినా… ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వైపాక్షిక టోర్నమెంట్లు ఆడదని చెప్పారు. ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
Anurag Thakur Comments on India-Pakistan Match
టోర్నమెంట్ నిబంధనల ప్రకారంగానే మల్టీనేషనల్ టోర్నమెంట్లలో భారత్ పార్టిసిపేషన్ ఉంటుందని, అంతమాత్రాన దౌత్య, జాతీయ విధానాలను ఇండియా మార్చుకున్నట్టు కాదని అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) స్పష్టం చేసారు. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ… ‘మల్టీనేషనల్ టోర్నమెంట్లను ఏసీసీ కానీ ఐసీసీ కానీ నిర్వహించినప్పుడు ఆయా దేశాలు అందులో పాల్గొనడం తప్పనిసరి. అలా చేయకుంటే ఆ దేశాలను టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. అలాగే ప్రత్యర్థి జట్లకు పాయింట్లు జోడిస్తారు. అయితే పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొనరాదని భారత్ చిరకాలంగా అనుసరిస్తున్న వైఖరికి కట్టుబడి ఉన్నాం’ అని చెప్పారు.
భారత్‌పై ఉగ్రదాడులు ఆపేంతవరకూ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ అడరాదనే నిర్ణయం చాలాకాలం క్రితమే తీసున్నట్టు అనురూగ్ ఠాకూర్ చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్‌ను రద్దు చేయాలని విపక్ష ఏఐఎంఐఎం, శివసేన (యూబీటీ) తదితర పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఠాకూర్ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు భారత్-పాక్ మ్యాచ్‌పై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ… ఆదివారం రాత్రి జరిగబోయే మ్యాచ్‌కు వ్యతిరేకంగా తమ పార్టీ నిరసన తెలుపుతుందని చెప్పారు. ‘రక్తం-క్రికెట్ కలిసి ప్రవహించవు’ అని అన్నారు. పాక్‌తో భారత్ మ్యాచ్‌పై మహారాష్ట్ర కాంగ్రెస్ మండిపడింది. ఇది పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లను అవమానించడమే అవుతుందని పేర్కొంది. మ్యాచ్‌కు అనుమతించడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతుందని ఎన్‌సీపీ(ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఇండియా-పాక్ మధ్య దుబాయ్‌లో సెప్టెంబర్ 14న జరిగే మ్యాచ్‌పై తాత్కాలిక స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు గత గురువారం నాడు నిరాకరించింది.
క్రికెటర్లను బీసీసీఐ బలవంతపెట్టొద్దు – పహల్గాం బాధితురాలి ఆవేదన
ఆసియా కప్ లో (India) భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్ ఆడొద్దని దేశ ప్రజలు అనేకసార్లు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. అయితే పలు నిబంధనల మేరకే ఆదివారం ఆ మ్యాచ్ ఆడుతున్నట్లు ఐసీసీ, ఏసీసీ ప్రకటించడంపై పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలు ఐషాన్య ద్వివేది స్పందించారు. భారత్-పాక్ మ్యాచ్‌పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో బీసీసీఐ క్రికెటర్లను బలవంతపెట్టొద్దన్నారు. అసలు మ్యాచ్‌కి కూడా అంగీకరించకుండా ఉండాల్సిందని ఆవేదన వ్యక్తంచేశారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను బీసీసీఐ విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.
భారత్-పాక్ మ్యాచ్ ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ… కేవలం ఇద్దరు ముగ్గురు క్రికెటర్లే ముందుకువచ్చారని… మిలిగినవారు ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఐషాన్య అన్నారు. పాక్ తో మ్యాచ్ ఆడాలని క్రికెటర్లను బీసీసీఐ బలవంతపెట్టొద్దని… దేశం తరఫున నిలబడాలని సూచించాలన్నారు. కానీ అందుకు విరుద్ధంగా బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. పహల్గాం దాడిలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాల వేదనను అప్పుడే మర్చిపోయారా అని స్పాన్సర్లు, క్రికెటర్లను ప్రశ్నించారు. ఈ మ్యాచ్‌తో వచ్చిన ఆదాయాన్ని ఆ దేశ ప్రభుత్వం మళ్లీ ఉగ్రవాదులను పోషించడానికే ఉపయోగిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మ్యాచ్‌ను నిర్వహిస్తే.. మనపై దాడి చేయడానికి వారిని మనమే సిద్ధం చేస్తున్నట్లు అవుతుందన్నారు. దేశ ప్రజలంతా భారత్-పాక్ మ్యాచ్‌ను వీక్షించకుండా బహిష్కరించాలని కోరారు.
పహల్గాం ఉగ్రదాడిలో హనీమూన్ కోసం కశ్మీర్‌కు వెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యాపారి శుభమ్ ద్వివేది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాన్పుర్‌కు చెందిన శుభమ్ ద్వివేదికి.. ఇషానాయ్ ద్వివేదితో ఫిబ్రవరి 12న వివాహమైంది. అనంతరం ద్వివేది.. తన భార్యతో విహారయాత్ర కోసం కశ్మీర్ వెళ్లారు. వారు బైసరన్ లోయలో సరదాగా విహరిస్తున్న సమయంలో వారిని చుట్టుముట్టిన ఉగ్రవాదులు పేరు అడిగి ముందుగా ద్వివేది తలపై కాల్చి చంపినట్లు ఆయన భార్య పేర్కొన్నారు. ఆ దాడిలో ద్వివేదితో సహా 26 మంది పర్యాటకులు తమ ప్రాణాలను కోల్పోయారు.
Also Read : Sushila Karki: మహిళా సాధికారతకు పట్టం సుశీల కర్కి నియామకం – ప్రధాని మోదీ
