AP Assembly Session : ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్
కూటమి ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు...
AP Assembly : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్(Abdul Nazeer) ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని.. ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని అన్నారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్(Abdul Nazeer) చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని.. అన్నక్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని అన్నారు.
AP Assembly Session-Governor Addresses
కూటమి ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. అవకాశాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నామని అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని స్పష్టంచేశారు. ప్రతినెల 1నే ఇంటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. పెన్షన్లు రూ. 4 వేలకు పెంచామని.. పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు, విద్య, వైద్యం అందజేస్తున్నామన్నారు. మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు.బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు.
స్థానిక సంస్థలు,నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఏడాదికి 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేది తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. ప్రతి కుటుంబానికి రక్షిత తాగునీరు, విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్(Abdul Nazeer) పేర్కొన్నారు.
ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామన్నారు. మన బడి- మన భవిష్యత్తు ద్వారా స్కూల్స్‌లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని.. P-4 విధానం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మెరిట్ ఆధారంగా 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించామన్నారు. స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించామన్నారు. ఐటీఐలు, పాలిటెక్నిక్‌ల్లో 200 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.
2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సభలో తెలియజేశారు. పోలవరం- బనకచర్ల పూర్తయితే రాయలసీమలో కరువు ఉండదన్నారు. రాష్ట్రంలో సూర్య ఘర్ యోజన కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశామని, తమ ప్రభుత్వ చర్యలతో టూరిజంలో పెట్టుబడులు పెరిగాయన్నారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు అండగా ఉన్నామని.. అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థిక పతనం అంచుకు చేరిందని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి జరిగిన నష్టంపై 7 శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలిపామన్నారు. వైసీపీ పాలనలో వనరుల మళ్లింపు, భారీగా సహజవనరుల దోపిడీ జరిగిందని గవర్నర్ అబ్దుల్ సభలో వెల్లడించారు.
Also Read : Minister Komatireddy :ఎస్ఎల్‌బీసీ లాంటి ప్రమాదాలు జరిగినపుడు కలిసికట్టుగా పని చేయాలి