AP Cabinet: ఏపీ రాజధాని అమరావతికి క్యాబినెట్ తీర్మానం

ఏపీ రాజధాని అమరావతికి క్యాబినెట్ తీర్మానం

 

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన త్రివిధ దళాలకు ఏపీ క్యాబినెట్ అభినందనలు తెలిపింది. ప్రధాని, భారత సైన్యానికి అండగా ఉండాలని నిర్ణయించింది. అనంతరం పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనితో ఏపీ రాజధాని అమరావతిగా క్యాబినెట్ తీర్మానం చేసినట్లయింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కేబినెట్ కోరింది. పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి అని పెట్టాలని మంత్రి మండలి కోరింది. దీని వలన అమరావతికి చట్టబద్ధత కల్పించినట్టు అవుతుందని క్యాబినెట్ పేర్కొంది. అలాగే వైసీపీ హయాంలో ఆమోదించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న 3 చట్టసవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాని క్యాబినెట్‌లో నిర్ణయించారు. క్యాపిటల్ అమరావతిని ఫ్రీ జోన్‌గా చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు.

 

2014 పునర్విభజన చట్టంలో రాజధాని అమరాతి అని లేదని… ఒకసారి పునర్విభజన చట్టంలో రాజధాని అమరావతి అని నిర్ణయిస్తే రాజధానికి చట్టబద్ధత కల్పించినట్లు అవుతుందని పలువురు న్యాయనిపుణులతో పాటు ఇటీవల సీఎం చంద్రబాబును కలిసిన రైతులు కూడా సూచించారు. ఈ క్రమంలో రాజధాని అమరావతిగా నిర్ణయించి క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. 2014 పునర్విభజన చట్టాన్ని కేంద్రంలో ఉన్న ఉభయసభలు ఆమోదించాయి. అందువల్ల వాటికి చట్టసవరణ చేయాలి అంటే రాజ్యసభ, లోకసభ చేయాల్సి ఉండటంతో ఏపీ రాజధాని అమరావతి అని పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని తీర్మానంలో కేంద్రాన్ని అభ్యర్థించారు.

దీనికి సంబంధించి వెంటనే ఢిల్లీలోని ఎంపీలతో మాట్లాడి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ తీర్మానాన్ని ఆమోదించేలా చూడాలని నిర్ణయించారు. అందువల్లే ఈరోజే క్యాబినెట్‌లో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనితో పాటు మరో అంశంపై కూడా ఏపీ కేబినెట్‌లో చర్చించారు. ఏపీలో వివిధ సంస్థలకు భూములు కేటాయింపు, రాజధాని అమరావతిలో ఇటీవల కాలంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో భూముల కేటాయింపుపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈ ప్రాజెక్ట్ వలన ఎంతో ఉపయోగం ఉందని మంత్రులకు ముఖ్యమంత్రి వివరించారు.

 

అలాగే, ఈ భేటీలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి క్యాబినెట్‌ ధన్యవాదాలు తెలిపింది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించింది. తీరప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించింది. ఆపరేషన్‌ సిందూర్‌ అనే పేరు బాగుందని, దేశ ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఈ పేరు ఉందని క్యాబినెట్‌ అభిప్రాయపడింది. ఇదే తరహాలో రాష్ట్రంలోని పలు సంక్షేమ పథకాలకు మంచి పేర్లు పెట్టేలా దృష్టిపెట్టాలని నిర్ణయించింది. ఏపీ క్యాబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు.

ఏపీ కేబినెట్ లో ముఖ్యాంశాలు

 

అమృత్‌ స్కీమ్‌ నిధుల సద్వినియోగానికి కొత్త విధానం
జలవనరుల శాఖలో జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం
రూ.349 కోట్లతో కాలువల్లో పూడికతీతకు ఆమోదం
చెరువుల్లో మట్టిని రైతులు ఉచితంగా తీసుకెళ్లేందుకు ఆమోదం
కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌ బిల్లులు వెనక్కి తీసుకొనేందుకు నిర్ణయం
పారిశ్రామిక వివాదాల సవరణ చట్టం, లేబర్‌ లాస్‌ సవరణ చట్టంవెనక్కి తీసుకుంటూ నిర్ణయం
జాలర్లకు రూ.20వేల చొప్పున ఆర్థిక సాయానికి ఆమోదం
కడప జిల్లాలో ఆదానీ గ్రీన్‌ ఎనర్జీ పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు నెడ్‌ క్యాప్‌ ద్వారా 19,164 ఎకరాల భూ కేటాయింపు.. రైతులకు రూ.31వేలు చొప్పున చెల్లించేలా ఆదేశం
కర్నూలు జిల్లాలో సిటీ గ్యాస్‌ టెర్మినల్‌ కోసం ఐవోసీకి ఐదెకరాలు
విశాఖలో టూరిజం డెవలప్‌మెంట్‌ అథారిటీకి 18.7 ఎకరాలు కేటాయింపు
పర్యాటక శాఖ మెగా ఈవెంట్లకు రూ.78 కోట్లు కేటాయింపునకు ఆమోదం
మారిటైమ్‌ బోర్డు భూములను ఏపీఐఐసీకి బదలాయించేందుకు ఆమోదం
నెల్లూరు భగత్‌సింగ్‌ నగర్‌లతో కట్టడాలు క్రమబద్ధీకరిస్తూ క్యాబినెట్‌ ఆమోదం

 

Leave A Reply

Your Email Id will not be published!